Rishabh Pant: రిషభ్‌ పంత్‌ తప్పుల నుంచి నేర్చుకోవడం లేదు: డేల్‌ స్టెయిన్‌

టీమ్‌ఇండియా తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న రిషబ్‌ పంత్‌పై పలువురు మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో పంత్‌లు అవుట్  అవుతున్న తీరే అందుకు గల కారణం. ఈ సిరీస్‌లో పంత్‌  4 మ్యాచ్‌ల్లో

Published : 19 Jun 2022 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న రిషబ్‌ పంత్‌పై పలువురు మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో పంత్‌లు అవుట్  అవుతున్న తీరే అందుకు గల కారణం. ఈ సిరీస్‌లో పంత్‌  4 మ్యాచ్‌ల్లో  57పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా పంత్‌ ఆఫ్‌స్టంప్‌ వెలుపలగా వెళ్లే బంతిని వెంటాడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు.  పంత్ బలహీనతను గుర్తించిన దక్షిణాఫ్రికా బౌలర్లు అతడు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఆఫ్‌సైడ్‌ వైడ్‌ దిశగా బంతిని విసిరి బుట్టలో వేసుకుంటున్నారు.  4 మ్యాచ్‌ల్లోనూ పంత్‌ ఇదే రీతిలో ఔటయ్యాడు.  పంత్‌ ఇలా ఔటవుతుండటంపై భారత మాజీ ఆటగాళ్లు సునీల్ గావస్కర్, వసీం జాఫర్‌ స్పందించారు. చేసిన తప్పే ఎన్నిసార్లు చేస్తావ్‌.. అంటూ మండిపడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ కూడా పంత్‌ ఔటవుతున్న తీరుపై మాట్లాడాడు. 

‘రిషభ్ పంత్‌ ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రతి మ్యాచ్‌లో చేసిన తప్పే మళ్లీ మళ్లీ  చేశాడు. మంచి ఆటగాళ్లు వారి తప్పుల నుంచి  నేర్చుకుంటారు. కానీ, పంత్‌ అలా చేయట్లేదు’ అని స్టెయిన్‌ పేర్కొన్నాడు. ఇదే సమయంలో భారతజట్టులోకి పునరాగమనం చేసిన  సీనియర్‌ ఆటగాడు దినేశ్‌కార్తీక్‌ను స్టెయిన్‌ ప్రశంసించాడు. ‘కార్తీక్‌ తన క్లాస్‌ ఆటతో ఆకట్టుకుంటున్నాడు. బౌలర్‌ ఏ బంతి వేస్తాడో ముందుగానే పసిగట్టి మంచి షాట్లు ఆడుతున్నాడు. టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ గెలవాలంటే బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చే ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలి’ అని స్టెయిన్‌ అన్నాడు.  అనేక విమర్శలు ఎదుర్కొంటున్న రిషబ్‌ ఆదివారం బెంగళూరులోని  చిన్నస్వామి వేదికగా జరగబోయే సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి మరి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని