Ricky Ponting : నాకంటే ఎక్కువ ప్రతిభ అతడిలోనే ఉందనిపిస్తుంది: రికీ పాంటింగ్‌

ప్రస్తుత సీజన్‌లో నాలుగు మ్యాచుల్లో రెండు అర్ధశతకాలతో...

Published : 14 Apr 2022 01:20 IST

పృథ్వీ షాపై ప్రశంసలు కురిపించిన దిల్లీ కోచ్‌

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా యువ బ్యాటర్ పృథ్వీ షాపై దిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత సీజన్‌లో నాలుగు మ్యాచుల్లో రెండు అర్ధశతకాలతో 160 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా దూకుడుగా ఆడటంలో పృథ్వీ షా ఏమాత్రం ఆలోచించడని పాంటింగ్‌ పేర్కొన్నాడు. ‘‘నేను పృథ్వీ ఆటను పరిశీలిస్తుంటే ఒకటే అనిపిస్తుంది. నా కంటే ఎక్కువ టాలెంట్ అతడిలోనే ఉంది. అందుకే చెబుతున్నా టీమ్‌ఇండియా కోసం పృథ్వీ కనీసం వంద టెస్టులైనా ఆడాలని ఆశిస్తున్నా. దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాడిగా మార్చాలని నా కోరిక. కోచ్‌గా నాకు ఆనందాన్నిచ్చే అంశాలలో అదొక్కటే’’ అని పాంటింగ్‌ వివరించాడు.

టీ20 లీగ్‌లో కోచ్‌గా బాధ్యతలు చేపట్టడమంటే జాతీయ జట్టుకు అవసరమయ్యే ఆటగాళ్లను తయారు చేయడంగానూ భావిస్తానని రికీ పాంటింగ్ తెలిపాడు. ‘‘గతంలో నేను ముంబయికి కోచ్‌గా ఉన్నప్పుడు కూడానూ ఇదే చేశా. అప్పుడు రోహిత్ శర్మ యువకుడు. హార్దిక్‌, కృనాల్‌ ఇంకా రాలేదు. ఆ జట్టుకు కోచింగ్‌ ఇచ్చిన తర్వాత చాలా మంది క్రికెటర్లు తమ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీమ్‌ నుంచి వారు దూరమైనా.. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగారనేది కోచ్‌లకు సంతోషం కలిగిస్తుంది’’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. రికీ నేతృత్వంలోని దిల్లీ జట్టు 2020 సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని