FIFA: మెస్సీ ప్రపంచకప్‌ కలను భగ్నం చేసిన సబ్‌స్టిట్యూట్‌..!

2014లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ప్రపంచకప్‌ను కోల్పోయింది. జర్మనీకి చెందిన ఓ ఆటగాడు చివరి నిమిషాల్లో కొట్టిన గోల్‌ మెస్సీ ఆశలను చిదిమేసింది.

Updated : 28 Nov 2022 10:35 IST

(ఫొటో: మారియో గోట్జే ఫేస్‌బుక్‌ నుంచి)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫుట్‌బాల్‌ గాడ్‌గా పేరున్న మెస్సీ ప్రపంచకప్‌ కలను ఓ సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు చేసిన గోల్‌ భగ్నం చేసింది. విజయానికి ఒక్క అడుగు దూరంలో అర్జెంటీనా జట్టు ఉసూరుమంటూ రన్నరప్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. 2014 ప్రపంచకప్‌లో గ్రూప్‌, నాకౌట్‌ దశల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా అర్జెంటీనా ఫైనల్స్‌ చేరింది. మరోవైపు జర్మనీ గ్రూప్‌ దశలో ఒక మ్యాచ్‌ డ్రా చేసుకొని.. మిగిలిన రెండింట్లో విజయం సాధించి నాకౌట్‌ దశకు చేరుకొంది. ఆ తర్వాత వరస విజయాలతో ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.  ఈ సీజన్‌లో జర్మనీ స్టార్‌ ఆటగాడు థామస్‌ ముల్లర్‌ (5గోల్స్‌), అర్జెంటీనా దిగ్గజం మెస్సీ (4)గోల్స్‌ సాధించి భీకరమైన ఫామ్‌తో టాప్‌-3 గోల్‌ స్కోరర్లుగా నిలిచారు.

జులై 14వ తేదీన ఈ దిగ్గజ జట్ల మధ్య హోరాహోరీగా ఫైనల్స్‌ జరిగింది. గతంలో ఈ రెండు జట్లు రెండు సార్లు ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో తలపడ్డాయి. 1986లో అర్జెంటీనా విజయం సాధించగా.. 1990లో వెస్ట్‌ జర్మనీ గెలిచింది. దీంతో 2014 ఫైనల్‌ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇరు జట్ల మధ్య గోల్‌ కోసం రసవత్తర పోరు జరిగింది. తొలి అర్ధభాగంలో అర్జెంటీనా ఆటగాడు మెస్సీకి గోల్స్‌ చేసే అవకాశం వచ్చినా.. విజయం సాధించలేకపోయాడు. మరో వైపు అర్జెంటీనా రక్షణ వలయాలను జర్మనీ ఛేదించలేకపోయింది. ఆట 88వ నిమిషంలో జర్మనీ సెంటర్‌ ఫార్వర్డు ఆటగాడు మిరోస్లావ్‌ క్లోసె స్థానంలో మిడ్‌ ఫీల్డర్‌ మారియో గోట్జె సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి అడుగుపెట్టాడు. 90 నిమిషాలు పూర్తైనా ఇరుపక్షాలు గోల్‌ చేయలేదు. దీంతో అదనపు సమయం కేటాయించారు. అప్పుడు కూడా ఇరు జట్లు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడాయి. మరో ఏడు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా.. జర్మనీ సబ్‌స్టిట్యూట్‌  ఆటగాడు మారియో గోట్జె అద్భుతమై వాలీ షాట్‌తో అర్జెంటీనా గోల్‌కీపర్‌ సెర్గియో రోమెరోను బోల్తా కొట్టించి గోల్‌ చేశాడు. ఆ గోల్‌తో జర్మనీ విజయం ఖాయమైంది. తమ దేశానికి ప్రపంచకప్‌ను అందించాలన్న మెస్సీ కలను ఓ సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు భగ్నం చేశాడు. ఈ మ్యాచ్‌లో వాస్తవానికి అర్జెంటీనాతో పోలిస్తే జర్మనీనే దూకుడుగా ఆడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని