రోహిత్‌ సహా ఐదుగురికి ఖేల్‌రత్న

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి క్రీడా పురస్కారాలు ప్రకటించింది. రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు అర్జున పురస్కారాలు ఇవ్వడానికి నిరాకరించింది. మొత్తం 27 మందికి అర్జున, ఐదుగురికి ఖేల్‌రత్న ఇస్తున్నామని తెలిపింది.....

Updated : 21 Aug 2020 20:03 IST

సాక్షి, మీరాబాయికి అర్జున తిరస్కరించిన ప్రభుత్వం

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి క్రీడా పురస్కారాలు ప్రకటించింది. రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు అర్జున పురస్కారాలు ఇవ్వడానికి నిరాకరించింది. మొత్తం 27 మందికి అర్జున, ఐదుగురికి ఖేల్‌రత్న ఇస్తున్నామని తెలిపింది.

విశ్రాంత న్యాయమూర్తి ముకుందమ్ శర్మ నేతృత్వంలోని పురస్కారాల ఎంపిక కమిటీ మొత్తం 29 మందికి అర్జున, ఐదుగురికి ఖేల్‌రత్న ప్రతిపాదించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం అందించిన సాక్షి మాలిక్‌, 2017 వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌ మీరాబాయి చాను పేర్లనూ అర్జునకు ప్రతిపాదించింది. తుది నిర్ణయం మాత్రం క్రీడామంత్రి కిరణ్‌ రిజిజుకు వదిలేసింది.

సాక్షి, మీరాబాయి గతంలోనే ఖేల్‌రత్న అందుకోవడంలో ఎంపిక కమిటీ నిర్ణయంపై కొందరు పెదవి విరిచారు. అత్యున్నత పురస్కారమైన ఖేల్‌రత్న వచ్చాక అంతకన్నా తక్కువ విలువైన అర్జున ఎందుకని ప్రశ్నించారు. కాగా కమిటీ ప్రతిపాదించిన ఐదుగురికీ కేంద్రం ఖేల్‌రత్నకు ఎంపిక చేయడం గమనార్హం.

క్రికెటర్‌ రోహిత్‌ శర్మ, రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌, పారాలింపిక్‌ స్వర్ణపతక విజేత మరియప్పన్‌ తంగవేలు, టీటీ క్రీడాకారిణి మనికా బాత్రా, మహిళల హాకీ సారథి రాణి రాంపాల్‌కు పురస్కారాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా పురస్కారాలను రాష్ట్రపతి భవన్‌లో జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అందిస్తారు. ఈ సారి కొవిడ్‌-19 ఉండటంతో వర్చువల్‌గా వేడుక నిర్వహించనున్నారు.

అర్జున విజేతలు వీరే

ఆర్చరీ - అతను దాస్, అథ్లెటిక్స్ - ద్యుతీచంద్‌,  బ్యాడ్మింటన్ - సాత్విక్‌ సాయిరాజ్‌, బ్యాడ్మింటన్ - చిరాగ్ చంద్ర శేఖర్ శెట్టి, బాస్కెట్ బాల్ - విశేష్ భ్రిగువంశీ, బాక్సింగ్ - సుబేదార్ మనీష్ కౌశిక్, లోలినా బోర్కే, క్రికెట్-దీప్తి శర్మ, ఇషాంత్ శర్మ, ఇక్వెస్ట్రియన్‌ -సావంత్ అజయ్ అనంత్, ఫుట్‌బాల్- సందేశ్‌ జింగాన్, గోల్ఫ్-అదితి కౌశిక్, హాకీ- ఆకాష్ దీప్ సింగ్, హాకీ-దీపికా, కబ్బడి-దీపక్, ఖో-ఖో-సరికా సుధాకర్, రోయింగ్‌ -దత్తూన్, పారా షూటింగ్- మనీశ్‌ నర్వాల్





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని