Hardik Pandya: ఒక్క గేమ్‌తో హార్దిక్‌ మంచి కెప్టెన్‌ కాడని చెప్పకూడదు

ఒక్క గేమ్‌తో హార్దిక్‌ పాండ్య మంచి కెప్టెన్‌ కాడని చెప్పడం సరికాదని ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్వాన్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 12 Apr 2022 19:27 IST

ఇంగ్లాండ్‌ మాజీ ప్లేయర్‌ గ్రేమ్‌ స్వాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక్క గేమ్‌తో హార్దిక్‌ పాండ్య మంచి కెప్టెన్‌ కాడని చెప్పడం సరికాదని ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్వాన్‌ అభిప్రాయపడ్డాడు. గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 163 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆ జట్టు సారథి హార్దిక్‌ పాండ్య భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోయాడు. ముఖ్యంగా అతడు బౌలింగ్‌ చేసిన 13వ ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి (17) ఇచ్చిన క్యాచ్‌ను సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి అందుకోలేకపోవడంతో నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో అభిమానులు, నెటిజన్లు పాండ్య కెప్టెన్సీపై మండిపడ్డారు.

అతడికి కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణాలు లేవని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్‌స్వాన్‌.. ఒక్క మ్యాచ్‌తో పాండ్య కెప్టెన్సీపై అంచనాలకు రాకూడదని తెలిపాడు. ‘ఒక్కసారిగా హార్దిక్‌ పాండ్య మంచి కెప్టెన్‌ కాడని చెప్పకూడదు. గుజరాత్ తగినంత స్కోర్‌ చేయలేకనే ఓటమిపాలైంది. ఇదే నిజం. ఆ జట్టు ఓటమికి పాండ్య కెప్టెన్సీ కారణం కాదు. అతడు తన కర్తవ్యాన్ని బాగానే నిర్వర్తించాడు. కీలక సమయాల్లో బౌలర్లు లేదా కెప్టెన్‌ కాస్త ఫ్రస్టేషన్‌కు గురవుతారు. అంతమాత్రాన వాళ్లు మంచి కెప్టెన్‌ కాకుండాపోరు’ అని స్వాన్‌ వివరించాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ మాట్లాడుతూ షమి తీరును తప్పుబట్టాడు. అతడు కనీసం క్యాచ్‌ అందుకునే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించాడు. ఇలాంటి స్కోర్లను కాపాడుకునే క్రమంలో ఆటగాళ్లు మరింత ప్రత్యేక శ్రద్ధతో ఆడాలన్నాడు. ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని