T20 World Cup: ఇంగ్లాండ్‌ పంజా

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా టీ20 ప్రపంచకప్‌లో అడుగు. కానీ గ్రూప్‌ దశలో తడబాటు. ఒకానొక దశలో నిష్క్రమించేలా పరిస్థితులు.

Published : 21 Jun 2024 03:19 IST

విండీస్‌పై ఘన విజయం
చెలరేగిన సాల్ట్, బెయిర్‌స్టో

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా టీ20 ప్రపంచకప్‌లో అడుగు. కానీ గ్రూప్‌ దశలో తడబాటు. ఒకానొక దశలో నిష్క్రమించేలా పరిస్థితులు. కానీ ప్రమాదాన్ని దాటి నిలబడ్డ ఇంగ్లాండ్‌.. తన సూపర్‌- 8 తొలి పోరులో అసలైన ఆటతీరుతో అదరగొట్టింది. ఛాంపియన్‌లా విరుచుకుపడి.. ఆతిథ్య విండీస్‌ జోరుకు కళ్లెం వేసింది. 

గ్రాస్‌ ఐలెట్‌ (సెయింట్‌ లూసియా)

టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌- 8 దశను ఇంగ్లాండ్‌ ఘనంగా మొదలెట్టింది. గురువారం గ్రూప్‌- 2 మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. మొదట విండీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఛార్లెస్‌ (38; 34 బంతుల్లో 4×4, 1×6), పావెల్‌ (36; 17 బంతుల్లో 5×6), పూరన్‌ (36; 32 బంతుల్లో 4×4, 1×6) సమష్టిగా రాణించారు. ఆదిల్‌ రషీద్‌ (1/21), మొయిన్‌ అలీ (1/15) మెరిశారు. ఛేదనలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫిల్‌ సాల్ట్‌ (87 నాటౌట్‌; 47 బంతుల్లో 7×4, 5×6), బెయిర్‌స్టో (48 నాటౌట్‌; 26 బంతుల్లో 5×4, 2×6) చెలరేగడంతో ఇంగ్లాండ్‌ 2 వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. 

దంచుడే దంచుడు: ఛేదనను నెమ్మదిగా మొదలెట్టిన ఇంగ్లాండ్‌ క్రమంగా బాదుడు పెంచుకుంటూ పోయింది. పవర్‌ప్లేలో బ్యాటర్లను స్పిన్నర్‌ అకీల్‌ కట్టడి చేశాడు. తానాడిన తొలి 10 బంతుల్లో 8 పరుగులే చేసిన సాల్ట్‌.. రసెల్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో జోరందుకున్నాడు. అంతకంటే ముందే 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అకీల్‌ బౌలింగ్‌లో సాల్ట్‌ క్యాచ్‌ను వికెట్‌కీపర్‌ పూరన్‌ చేజార్చడం విండీస్‌ కొంపముంచింది. బట్లర్‌ (25) కూడా కుదురుకోవడంతో ఇంగ్లాండ్‌ 6 ఓవర్లలో 58/0తో నిలిచింది. ఈ టోర్నీలో వెస్టిండీస్‌పై ఓ జట్టు చేసిన అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరు ఇదే. కానీ 15 బంతుల వ్యవధిలో బట్లర్, మొయిన్‌ అలీ (13)ని ఔట్‌ చేసి పోటీలోకి వచ్చేందుకు విండీస్‌ ప్రయత్నించింది. కానీ సాల్ట్, బెయిర్‌స్టో జోడీ ప్రత్యర్థికి ఆ అవకాశమే ఇవ్వలేదు. అభేద్యమైన మూడో వికెట్‌కు 44 బంతుల్లోనే 97 పరుగులు జోడీంచి జట్టును గెలిపించారు. మధ్యలో సాల్ట్‌ కాస్త నెమ్మదించినా బెయిర్‌స్టో బౌండరీల వేటలో సాగాడు. అకీల్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4 బాదేశాడు. విజయానికి 30 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన దశలో షెఫర్డ్‌ వేసిన 16వ ఓవర్లో సాల్ట్‌ విశ్వరూపమే ప్రదర్శించాడు. వరుసగా 4, 6, 4, 6, 6, 4తో విధ్వంసం సృష్టించాడు. ఇదే ఊపులో ఇంగ్లాండ్‌ పని పూర్తిచేసింది. 

51 డాట్‌బాల్స్‌.. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన    వెస్టిండీస్‌ బ్యాటర్లు మంచి ఆరంభాలను వృథా చేసుకున్నారు. కింగ్‌ (23), ఛార్లెస్, పూరన్, పావెల్‌ భారీ స్కోర్లు చేయలేకపోయారు. పక్కటెముకల నొప్పితో కింగ్‌ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగినా.. ఛార్లెస్‌ దూకుడుతో ఆ జట్టు పవర్‌ప్లేలోనే 50 పరుగులు దాటేసింది. పూరన్, ఛార్లెస్‌ కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఛార్లెస్‌ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన పావెల్‌ సిక్సర్లతోనే మాట్లాడాడు. లివింగ్‌స్టన్‌ ఓవర్లో మూడు సిక్సర్లు బాదిన అతను చివరి బంతికి ఔటైపోయాడు. చివరి ఓవర్లలో ఇంగ్లాండ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసింది. వరుస ఓవర్లలో పూరన్, రసెల్‌ (1)ను ఔట్‌ చేసింది. ఆఖర్లో రూథర్‌ఫర్డ్‌ మెరుపులతో ఆ జట్టు 180కి చేరుకుంది. ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్లు 51 డాట్‌బాల్స్‌ వేశారు. ముఖ్యంగా ఆర్చర్‌ (1/34), రషీద్‌ కలిపి 22 డాట్‌బాల్స్‌ వేయడం విశేషం. 

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: కింగ్‌ రిటైర్డ్‌హర్ట్‌ 23; ఛార్లెస్‌ (సి) బ్రూక్‌ (బి) అలీ 38; పూరన్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 36; పావెల్‌ (సి) వుడ్‌ (బి) లివింగ్‌స్టన్‌ 36; రసెల్‌ (సి) సాల్ట్‌ (బి) రషీద్‌ 1; రూథర్‌ఫర్డ్‌ నాటౌట్‌ 28; షెఫర్డ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 180; వికెట్ల పతనం: 1-94, 2-137, 3-141, 4-143; బౌలింగ్‌: టాప్లీ 3-0-26-0; మార్క్‌వుడ్‌ 3-0-36-0; ఆర్చర్‌ 4-0-34-1; కరన్‌ 3-0-25-0; ఆదిల్‌ రషీద్‌ 4-0-21-1; మొయిన్‌ అలీ 2-0-15-1; లివింగ్‌స్టన్‌ 1-0-20-1

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: ఫిల్‌ సాల్ట్‌ నాటౌట్‌ 87; బట్లర్‌ ఎల్బీ (బి) ఛేజ్‌ 25; మొయిన్‌ అలీ (సి) ఛార్లెస్‌ (బి) రసెల్‌ 13; బెయిర్‌స్టో నాటౌట్‌ 48; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (17.3 ఓవర్లలో 2 వికెట్లకు) 181; వికెట్ల పతనం: 1-67, 2-84; బౌలింగ్‌: అకీల్‌ 4-0-35-0; షెఫర్డ్‌ 2-0-41-0; రసెల్‌ 2-0-21-1; అల్జారి జోసెఫ్‌ 2.3-0-32-0; గుడకేశ్‌ మోటీ 4-0-32-0; రోస్టన్‌ ఛేజ్‌ 3-0-19-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని