IND vs AUS: వారు లేకపోవడం భారత్‌కు లోటే.. ఆసీస్‌ దిగ్గజం కీలక వ్యాఖ్యలు

భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందే ‘కాక’ రేగుతోంది. టీమ్‌ఇండియాపై (Team India) మానసికంగా పైచేయి సాధించేందుకు అవసరమైన ఎత్తులన్నీ ఆసీస్‌ మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు మొదలుపెట్టారు.

Updated : 04 Feb 2023 17:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఫలానా జట్టుదే గెలుపు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు అంచనా వేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఇరు జట్లూ సాధన మొదలుపెట్టేశాయి. మరోవైపు మాటల యుద్ధం కూడా మొదలైంది. భారత్‌ను కవ్వించడానికి అవసరమైన  ప్రయోగాలన్నీ ఆసీస్‌ ఆటగాళ్లు, మాజీలు ప్రారంభించారు. తాజాగా టీమ్‌ఇండియాకు కోచ్‌గా పనిచేసిన క్రికెట్ దిగ్గజం గ్రెగ్ ఛాపెల్‌ కూడా తన విశ్లేషణ ఏంటో చెప్పాడు.  ఆస్ట్రేలియా తప్పకుండా విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించిన గ్రెగ్‌.. దానికి కారణం ఏంటో కూడా తెలిపాడు. 

‘‘అవును. టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది. అదీనూ భారత్‌ను వారి సొంత దేశంలోనే ఢీకొట్టి మరీ గెలుస్తుంది. దీనికి కారణం ఆ జట్టులో రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా అందుబాటులో లేకపోవడమే. రవీంద్ర జడేజా ఆడటంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. ఇప్పుడు టీమ్‌ఇండియా ఎక్కువగా విరాట్ కోహ్లీపైనే ఆశలు పెట్టుకొంది. అందుకే ఈసారి భారత్ చాలా బలహీనమైన జట్టుగా కనిపిస్తోంది. పర్యటనకు వచ్చే జట్లు పేస్ అనే పిచ్చితనంతో తరచూ అవివేకంగా మారుతున్నాయి. భారత్ ఇలాంటి పరిస్థితులను ఆకళింపు చేసుకొంది. అందుకే ఆసీస్‌ కూడా బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు మానసికంగానూ త్వరగా అలవాటు పడిపోవాలి’’

‘‘భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలమని అందరికీ తెలుసు. అందుకే నాథన్ లియాన్‌కు పార్టనర్‌గా ఆష్టన్ అగర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. తప్పకుండా ప్రభావం చూపుతాడనే  భావిస్తున్నా. టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కూడా ఇలానే వికెట్లు పడగొట్టాడు. అతడు సంధించే ఫ్లాట్‌ లెగ్‌బ్రేక్‌లు బ్యాటర్లకు ప్రమాదకరంగా ఉండేవి. బంతిని మిస్‌ అయితే దాదాపు వికెట్ పడినట్లే లెక్క. ఇప్పుడు రవీంద్ర జడేజా బౌలింగ్‌లోనూ ఇదే తీరు కనిపిస్తోంది’’ అని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని