
MS Dhoni : ధోనీ అత్యంత చురుకైన క్రికెట్ మేధావి.. మాజీ సారథిపై ఛాపెల్ ప్రశంసల జల్లు
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ క్రికెట్ అభిమానులకు గ్రెగ్ ఛాపెల్ గుర్తుండే ఉంటాడు కదా.. భారత ప్రధాన కోచ్‌గా (2005-2007) రెండేళ్ల పాటు పని చేసిన ఛాపెల్ వివాదాస్పద నిర్ణయాల దెబ్బకు హేమాహేమీలైన క్రికెటర్లే కుదేలైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ క్రికెట్ ఛానెల్‌తో గ్రెగ్ మాట్లాడుతూ.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోనే అత్యంత చురుకైన క్రికెట్ మేధావిగా ధోనీని అభివర్ణించాడు. ‘‘నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీది అద్భుతమైన నైపుణ్యం. ఇదే అతడి సమకాలీనుల్లో ధోనీని ప్రత్యేకంగా నిలిపింది. ప్రణాళికలను రచించడంలో ఎంతో చురుగ్గా ఉంటాడు. కొద్దికాలం ధోనితో కలిసి పనిచేశా. టాలెంట్‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఫ్యాషన్‌తో ఆటను ఆడిన వ్యక్తి ధోనీ’’ అని ఛాపెల్ పేర్కొన్నాడు.
‘‘అభివృద్ధి చెందిన క్రికెట్ దేశాలు ఆటకు సంబంధించిన సహజత్వాన్ని కోల్పోతున్నాయి. టాప్ ప్లేయర్ల క్రికెట్‌ను చూస్తూ యువకులు ఆటను నేర్చుకోవడం, స్నేహితులతో కలిసి ఆడటం వంటి పరిస్థితులు క్రమంగా దెబ్బతింటున్నాయి. భారత్ వంటి ఉపఖండ దేశంలో ఇప్పటికీ చాలా పట్టణాల్లో కోచింగ్‌కు సంబంధించి సౌకర్యాలు పెద్దగా లేవు. చాలా మంది యువకులు ఎలాంటి కోచ్ సాయం లేకుండా బయటి ప్రదేశాల్లో ఆడేస్తుంటారు. టీమ్ఇండియాలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఇలా ఆడి నేర్చుకున్నవారే. వారిలో ముఖ్యంగా రాంచీ పట్టణం నుంచి వచ్చిన ఎంఎస్ ధోనీ గురించి మాట్లాడుకోవాలి. అంతర్జాతీయంగా నేర్చుకునే దశలో వివిధ పిచ్‌ల మీద అనుభవజ్ఞులతో కలిసి ఆడినప్పుడు తనకు తాను వృద్ధి చెందిన విధానం అద్భుతం. కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం, స్ట్రాటజిక్ నైపుణ్యాలను ఒడిసిపట్టుకోవడం వల్ల తన సమకాలీనుల్లో ధోనీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు’’ అని వివరించాడు. టీమ్ఇండియా తరఫున దాదాపు 15 ఏళ్లపాటు (2004-2019) ప్రాతినిధ్యం వహించిన ఎంఎస్ ధోనీ.. నాయకుడిగా టీ20 ప్రపంచకప్ (2007), వన్డే వరల్డ్‌కప్ (2011)ను భారత్‌కు అందించాడు.