WTC Final: అలాంటి బంతులను సంధించాలి.. లేదంటే గిల్‌ చేతిలో శిక్ష తప్పదు: గ్రెగ్ ఛాపెల్

మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియాలో కీలక బ్యాటర్‌గా మారిన శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ (Wtc Final) జూన్‌ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 

Published : 04 Jun 2023 10:45 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ (IPL 2023) టోర్నీని అద్భుతమైన ఫామ్‌తో ముగించిన టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) మరో కీలక పోరుకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో (WTC Final) ఆడేందుకు ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. గతేడాది నుంచి మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తుండటంతో గిల్‌పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో శుభ్‌మన్‌ బ్యాటింగ్‌ తీరుపై క్రికెట్ దిగ్గజం గ్రెగ్ ఛాపెల్‌ (Greg Chappell) కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘శుభ్‌మన్‌ గిల్ ఆటను ఆస్ట్రేలియాలోనూ చూశా. టీమ్‌ఇండియా చేసిన అత్యుత్తమమైన పని ఏంటంటే.. ఇలాంటి యువ క్రికెటర్లకు విదేశాల్లో ఆడేందుకు విరివిగా అవకాశాలు ఇవ్వడం. ఇతరు టీమ్‌లు కూడా దీనినే అనుసరించాలి. అప్పుడే ఓవర్సీస్‌ పిచ్‌ల పరిస్థితి వారికి అర్థమవుతుంది. శుభ్‌మన్‌ గిల్‌కు తగినంత అనుభవం ఉంది. కానీ, ఇంగ్లాండ్‌లో ఆసీస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడు. అదనపు పేస్‌తో బంతులను సంధించే బౌలింగ్‌లో కష్టాలు తప్పవు. మిచెల్‌ స్టార్క్‌, హేజిల్‌వుడ్‌ లేదా బొలాండ్‌ ఎవరైనా సరే బౌన్స్‌తో బౌలింగ్‌ వేస్తే మాత్రం ఎంత పెద్ద బ్యాటర్‌ అయినా ఔటవ్వాల్సిందే. 

అయితే, ఆసీస్‌ బౌలింగ్‌ ఎటాక్‌పై మరీ ఎక్కువగా చెప్పను. శుభ్‌మన్‌ను కట్టడి చేయడానికి ఆసీస్‌ బౌలర్లు కొన్ని విషయాపై దృష్టిసారించాలి. మరీ ముఖ్యంగా ఆఫ్‌ స్టంప్‌ మీదుగా అదనంగా బౌన్స్‌తో బంతులను సంధిస్తే గిల్‌ ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంది. వికెట్‌ను సమర్పించే ఛాన్స్‌ లేకపోలేదు. ఆసీస్‌ బౌలర్లు దీనిపై తప్పకుండా దృష్టిసారించాలి. ఒకవేళ ఏమాత్రం అదుపు తప్పినా గిల్‌ నుంచి వారికి పనిష్‌మెంట్ తప్పదు’’ అని గ్రెగ్ తెలిపాడు. జూన్ 7వ తేదీ నుంచి ఓవల్‌ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 15 టెస్టులు ఆడిన శుభ్‌మన్‌ గిల్ రెండు శతకాలు, నాలుగు అర్ధశతకాలతో 890 పరుగులు చేశాడు. మరో 110 పరుగులు చేస్తే వెయ్యి రన్స్‌ క్లబ్‌లోకి చేరతాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని