GT vs CSK: గుజరాత్ vs చెన్నై ఫైనల్ మ్యాచ్.. ఈ రికార్డులు నమోదయ్యేనా..?
ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) విజేత ఎవరనేది తేలాలంటే ఆదివారం ఆగాల్సిందే. గుజరాత్ - చెన్నై జట్ల (GT vs CSK) మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ సందర్భంగా కొన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం లేకపోలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ ఫైనల్‌కు అహ్మదాబాద్ వేదిక. గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) జట్ల మధ్య టైటిల్ పోరు. నేడు రాత్రి 7.30 గంటలకు అసలైన సమరం ప్రారంభం కానుంది. వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను పట్టేయాలని గుజరాత్ ఆశిస్తోంది. మరోవైపు ఐదో కప్‌ను ఖాతాలో వేసుకోవాలని చెన్నై ఆశిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. మరి అవేంటో తెలుసుకుందాం..
- రెండో క్వాలిఫయర్‌లో సెంచరీతో కదం తొక్కిన ఆరెంజ్ క్యాప్ హోల్డర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం 851 పరుగులతో కొనసాగుతున్నాడు. అయితే, ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాలంటే గిల్ సరిగ్గా 123 పరుగుల దూరంలో ఉన్నాడు. ముంబయిపై సెంచరీ చేసిన ఊపులో ఉన్న మరోసారి అదే ప్రదర్శన చేస్తే విరాట్ (973)ను అధిగమిస్తాడు.
- ఒకే జట్టు నుంచి ముగ్గురు బౌలర్లు పర్పుల్ క్యాప్ రేసులో నిలవడం విశేషం. మహమ్మద్ షమీ (28 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత రషీద్ ఖాన్ (27 వికెట్లు), మోహిత్ శర్మ (24 వికెట్లు) ఉన్నారు. చెన్నైతో మ్యాచ్‌లో రషీద్ ఒక్క వికెట్, మోహిత్ నాలుగు వికెట్లు తీస్తే ముగ్గురు బౌలర్లు 28 వికెట్లతో ఉంటారు. ఇలా ఒకే సీజన్‌లో ఒకే జట్టు నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఉండటం కూడా ఓ రికార్డే.
- ప్రస్తుతం నాలుగు టైటిళ్లను సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి విజేతగా నిలవాలని అభిమానులు కోరుతున్నారు. ధోనీకిదే చివరి సీజన్ అని భావిస్తున్న తరుణంలో సహచరులు గిఫ్ట్ ఇస్తారో లేదో వేచి చూడాలి. అయితే, సీఎస్‌కే ఈసారి విజేతగా నిలిస్తే మాత్రం ముంబయితో సమంగా నిలుస్తుంది. ముంబయి ఇప్పటికే ఐదు టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. చెన్నైకూడా గెలిస్తే కప్‌ల సంఖ్య 5కి చేరుతుంది.
- చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి జట్లు మాత్రమే వరుసగా రెండు ఐపీఎల్ కప్‌లను సొంతం చేసుకున్న ఫ్రాంచైజీలుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ అవకాశం గుజరాత్ టైటాన్స్‌కు వచ్చింది. గతేడాది అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఫైనల్‌కు చేరడంతో రెండో సారి విజేతగా నిలిచి వాటి సరసన చేరుతుందో లేదో మరి.
- ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్‌ను గెలిస్తే ఐపీఎల్ చరిత్రలో మరో అద్భుతమైన రికార్డుగా మిగిలిపోతుంది. మరీ ముఖ్యంగా ధోనీ పేరిట అరుదైన ఘనత నమోదవుతుంది. అత్యధిక వయసులో ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గిన జట్టు సారథిగా ధోనీ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ధోనీ వయసు 41 ఏళ్లు.
- రుతురాజ్ గైక్వాడ్ మరో 36 పరుగులు చేస్తే ఈ సీజన్‌లో 600 రన్స్ చేసిన బ్యాటర్‌గా మారతాడు. ఇందులో ప్రత్యేకత ఏముందంటారా..? రుతురాజ్ 600+ పరుగులు చేసి చెన్నై విజేతగా నిలిస్తే మాత్రం అదీ ఓ రికార్డు అవుతుంది. చెన్నై 2021 సీజన్ విజేతగా నిలిచినప్పుడు కూడా రుతురాజ్ 635 పరుగులు చేశాడు. ఇలా సీఎస్‌కే కప్‌ను సొంతం చేసుకున్నప్పుడు రెండుసార్లు 600కిపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డును ఖాతాలో వేసుకుంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.