WPL: చెలరేగిన బౌలర్లు.. ఉత్కంఠపోరులో గుజరాత్‌ విజయం

ఉత్కంఠగా సాగిన పోరులో గుజరాత్‌ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్‌ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ జట్టు ఛేదించలేకపోయింది. ఆ జట్టు 18.4 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్‌ అయింది.  

Updated : 16 Mar 2023 23:10 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌(WPL)లో గుజరాత్‌ జెయింట్స్‌ రెండో విజయం నమోదు చేసింది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 11 పరుగుల తేడాతో గెలుపొందింది. గుజరాత్‌ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ జట్టు ఛేదించలేకపోయింది. 18.4 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్‌ అయింది. గుజరాత్‌ బౌలర్లలో కిమ్‌ గర్త్‌, తనూజ కన్వర్‌, గార్డెనర్‌ తలో రెండు వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లూరా వోల్వార్డ్‌ (57; 45 బంతుల్లో 6×4, 6×1), గార్డెనర్‌ (51 నాటౌట్‌; 33 బంతుల్లో 9×4) అర్ధశతకాలతో చెలరేగగా, డియోల్‌ (31) రాణించింది. 

ఓ మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిల్లీకి మంచి ఆరంభం లభించలేదు. 10 పరుగులకే షఫాలీ వర్మ ఔట్‌ అయింది. దీంతో క్రీజులోకి వచ్చిన ఎలైస్‌ క్యాప్సీతో జట్టు కట్టిన మరో ఒపెనర్‌ లానింగ్‌ ఇంకో వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో ఇద్దరూ చెలరేగడంతో 5.1 ఓవర్లకే దిల్లీ 48 పరుగులు చేసి మంచి స్థితిలో నిలిచింది. ఈక్రమంలో స్నేహా రాణా బౌలింగ్‌లో లానింగ్‌(18) ఎల్బీడబ్ల్యూ కాగా, ఆ వెంటనే 50 పరుగుల వద్ద దూకుడుగా ఆడుతున్నఎలైస్‌ క్యాప్సే(22: 11 బంతుల్లో 2X4, 2X6) రనౌట్‌ అయింది. మరో రెండు పరుగుల తర్వాత జెమిమా రోడ్రిగ్స్‌(1) పెవిలియన్‌ బాట పట్టింది. దీంతో దిల్లీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే మారిజాన్‌ కాప్‌(36) ఒంటరి పోరాటం చేయడంతో దిల్లీ మళ్లీ గాడిన పడింది. 97 పరుగుల వద్ద కాప్‌ ఔట్‌ కావడంతో దిల్లీకి మళ్లీ కష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అరుంధతి రెడ్డి(25) ఇన్నింగ్స్‌తో దిల్లీ ఆశలు సజీవంగా మారాయి. మూడు ఓవర్లలో దిల్లీ లక్ష్యం 20 పరుగుల సమీకరణానికి చేరుకుంది. ఈ క్రమంలో 18 ఓవర్‌ చివరి బంతికి అరుంధతి తొమ్మిదో వికెట్‌ రూపంలో ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ఉత్కంఠకు దారితీసింది. రెండు ఓవర్లలో 13 పరుగుల అవసరం కాగా దిల్లీ చేతిలో ఒకే వికెట్‌ ఉంది. అయితే ఉత్కంఠకు తెరదీస్తూ గుజరాత్‌ బౌలర్‌ గార్డెనర్‌.. పూనమ్‌ యాదవ్‌ను ఔట్‌ చేయడంతో దిల్లీ కథ ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని