WPL: గుజరాత్ జెయింట్స్‌ బోణీ.. ఆర్సీబీకి హ్యాట్రిక్‌ ఓటమి

మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCBW)కు హ్యాట్రిక్‌ ఓటమి. ఆర్సీబీపై గుజరాత్‌ జెయింట్స్‌ (GGW) 11 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది.

Updated : 08 Mar 2023 23:20 IST

ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCBW)కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆర్సీబీపై గుజరాత్‌ జెయింట్స్‌ (GGW) 11 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది బెంగళూరుకు హ్యాట్రిక్‌ ఓటమి. ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన (18) భారీ స్కోరు చేయలేకపోయినా.. సోఫీ డివైన్‌ (66; 45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించింది. ఎల్లీస్‌ పెర్రీ (32; 25 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. చివర్లో  హీథర్‌ నైట్‌ (30; 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడినా జట్టును విజయాలతీరాలకు చేర్చలేకపోయింది. గుజరాత్ బౌలర్లలో ఆష్లీన్‌ గార్డ్‌నర్‌ మూడు, అన్నాబెల్ రెండు, మాన్సీ జోషి ఒక వికెట్ పడగొట్టారు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్.. ఓపెనర్‌ సోఫియా డంక్లీ (65; 28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), హర్లీన్‌ డియోల్‌ (67; 45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌)  అర్ధ శతకాలతో విరుచుకుపడటంతో భారీ స్కోరు సాధించింది. ఆష్లీన్‌ గార్డ్‌నర్‌ (14), హేమలత (16), సథర్లాండ్ (14), స్నేహ్‌ రాణా (2), కీమ్ గార్త్ (3*), సుష్మా వర్మ (5*) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హీథర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మేఘన్‌ స్కట్, రేణుకా తలో వికెట్ తీశారు. 

డంక్లీ దంచెన్‌.. హర్లీన్ హరికేన్ !

గుజరాత్‌ ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభమైంది. మొదటి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా రాలేదు. ఎల్లీస్ పెర్రీ వేసిన రెండో ఓవర్‌లో డంక్లీ, మేఘన చెరో ఫోర్ బాదారు. మేఘన్‌ స్కట్ వేసిన మూడో ఓవర్‌లో సోఫియా రెండు ఫోర్లు బాదింది. ఇదే ఓవర్లో మేఘన ఓ బౌండరీ కొట్టి చివరి బంతికి రీచాఘోష్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. మేఘన ఔటైన తర్వాత సోఫియా డంక్లీ దూకుడు పెంచింది. రేణుకా సింగ్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదింది. ప్రీతి వేసిన తర్వాతి ఓవర్లో సోఫియా బౌండరీల మోత మోగించింది. వరుసగా 4,6,4,4,4 కొట్టి 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. శ్రేయాంక పాటిల్ వేసిన ఎనిమిదో ఓవర్లో సిక్సర్‌, ఫోర్‌ బాది చివరి బంతికి హీథర్‌ నైట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. గార్డ్‌నర్‌ను హీథర్ నైట్‌ వెనక్కి పంపిన తర్వాత క్రీజులోకి వచ్చిన హేమలత దూకుడుగా ఆడింది. ప్రీతి వేసిన 15 ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టింది. కానీ, తర్వాతి ఓవర్‌లోనే రేణుకా సింగ్‌కు చిక్కి పెవిలియన్‌ చేరింది. పెర్రీ వేసిన 17 ఓవర్లో హర్లీన్‌ డియోల్ వరుసగా మూడు ఫోర్లు బాదింది. ఈ క్రమంలోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకుంది. రేణుకా సింగ్ వేసిన 19 ఓవర్‌లో మొదటి బంతికి సథర్లాండ్, చివరి బంతికి స్నేహ్‌ రాణా ఔటయ్యారు. శ్రేయాంక వేసిన చివరి ఓవర్లో నాలుగో బంతికి డియోల్ పెవిలియన్‌ చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు