T20 League: తొలి అడుగు గుజరాత్‌దే

టీ20 లీగ్‌ అగ్ర జట్ల పోరులో గుజరాత్‌దే పైచేయి. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఆ జట్టు స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో లఖ్‌నవూను మట్టికరిపించింది. శుభ్‌మన్‌ పోరాటం మొదట గుజరాత్‌కు పోటీపడదగ్గ స్కోరును అందిస్తే.. రషీద్‌ ఖాన్‌, యశ్‌ దయాల్‌, షమి బంతితో ప్రత్యర్థిని కట్టిపడేశారు

Updated : 11 May 2022 07:15 IST

అధికారికంగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశం
రాణించిన శుభ్‌మన్‌, రషీద్‌
చిత్తుగా ఓడిన లఖ్‌నవూ

పుణె


టీ20 లీగ్‌ అగ్ర జట్ల పోరులో గుజరాత్‌దే పైచేయి. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఆ జట్టు స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో లఖ్‌నవూను మట్టికరిపించింది. శుభ్‌మన్‌ పోరాటం మొదట గుజరాత్‌కు పోటీపడదగ్గ స్కోరును అందిస్తే.. రషీద్‌ ఖాన్‌, యశ్‌ దయాల్‌, షమి బంతితో ప్రత్యర్థిని కట్టిపడేశారు. చెత్త బ్యాటింగ్‌తో లఖ్‌నవూ చిత్తయింది. ఈ మ్యాచ్‌కు ముందే ఈ రెండు జట్లకు ప్లేఆఫ్స్‌లో స్థానం దాదాపుగా ఖరారైంది. అయితే తొమ్మిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన గుజరాత్‌ అధికారికంగా ముందంజ వేసిన తొలి జట్టయింది. లఖ్‌నవూ 8 విజయాలతో రెండో స్థానంలో ఉంది.

గుజరాత్‌ అదరగొట్టింది. తక్కువ స్కోరే చేసినా మంగళవారం 62  పరుగుల తేడాతో లఖ్‌నవూను చిత్తు చేసింది. మొదట గుజరాత్‌ 4 వికెట్లకు 144 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (63 నాటౌట్‌; 49 బంతుల్లో 7×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అవేష్‌ ఖాన్‌ (2/26), మోసిన్‌ ఖాన్‌ (1/18) గుజరాత్‌ను కట్టడి చేశారు. ఛేదనలో లఖ్‌నవూ ఘోరంగా విఫలమైంది. రషీద్‌ ఖాన్‌ (4/24), యశ్‌ దయాల్‌ (2/24), సాయి కిశోర్‌ (2/7), షమి (1/5)ల ధాటికి లఖ్‌నవూ 13.5 ఓవర్లలో 82 పరుగులకే    కుప్పకూలింది. దీపక్‌ హుడా (27) టాప్‌ స్కోరర్‌. అతడు కాకుండా డికాక్‌ (11), అవేష్‌ ఖాన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

ఛేదనలో విలవిల: లక్ష్యం చిన్నదే అయినా ఛేదనలో లఖ్‌నవూ బ్యాటింగ్‌ పేలవం. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. కష్టంగా పరుగులు రాబట్టింది. ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. మ్యాచ్‌ పూర్తిగా గుజరాత్‌ నియంత్రణలోనే ఉంది. నాలుగో ఓవర్లో డికాక్‌ను యశ్‌ దయాల్‌ ఔట్‌ చేయడంతో మొదలైన పతనం ఏ దశలోనూ ఆగలేదు. వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చినట్లే వెనుదిరిగాడు. దీపక్‌ హుడా ఒక్కడే కాసేపు పోరాడాడు. కెప్టెన్‌ రాహుల్‌ (8) కూడా త్వరగా ఔట్‌ కావడం లఖ్‌నవూకు పెద్ద దెబ్బ. అయిదో ఓవర్లో షమి షార్ట్‌ బంతిని పుల్‌ చేయబోయిన రాహుల్‌.. వికెట్‌కీపర్‌ సాహాకు చిక్కి రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. ఓ వైపు హుడా నిలిచినా.. మరోవైపు నుంచి బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. కరణ్‌ శర్మ (4), కృనాల్‌ (5), బదోని (8), స్టాయినిస్‌ (2), హోల్డర్‌ (1) నుంచి కనీస ప్రతిఘటన కరవైంది. వీరంతా కనీసం రెండంకెల స్కోరైనా చేయకుండానే వెనుదిరిగారు. 67/7తో 12 ఓవర్లకే లఖ్‌నవూ ఓటమి ఖాయమైపోయింది. మిగతా మూడు వికెట్లు పోవడానికి ఎంతో సమయం పట్టలేదు. హుడాతొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ మాయాజాలంతో లఖ్‌నవూ  వెన్ను విరిచాడు.

రాణించిన శుభ్‌మన్‌: అంతకుముందు గుజరాత్‌ ఇన్నింగ్స్‌ చప్పగా సాగింది. ఏమాత్రం దూకుడు లేదు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది కానీ.. ఆ జట్టుకు ఏదీ కలిసి రాలేదు. లఖ్‌నవూ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు కష్టంగా వచ్చాయి. ఆరంభం పేలవం. పవర్‌ ప్లే ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 35 పరుగులే చేసింది గుజరాత్‌. మూడో ఓవర్లో సాహా (5)ను మోసిన్‌ ఔట్‌ చేయగా.. అయిదో ఓవర్లో వేడ్‌ (10)ని అవేష్‌ వెనక్కి పంపాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ నిలబడ్డా.. ధాటిగా ఆడలేదు. ఎక్కువగా సింగిల్స్‌ తీశాడు. అయితే గుజరాత్‌ ఇన్నింగ్స్‌కు అతడే వెన్నెముక. హార్దిక్‌ పాండ్య (13 బంతుల్లో 11) కూడా బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన అతడు.. చివరికి పదో ఓవర్లో, అవేష్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటై వెనుదిరిగాడు. హార్దిక్‌ ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌ డికాక్‌కు చిక్కాడు. కృనాల్‌, చమీర, మోసిన్‌ ఖాన్‌, అవేష్‌ బ్యాట్స్‌మెన్‌కు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. అవేష్‌, కృనాల్‌ బౌలింగ్‌లో గిల్‌ ఒక్కో ఫోర్‌ కొట్టినా.. ఇన్నింగ్సైతే ఊపందుకోలేదు. గిల్‌కు అండగా నిలిచినప్పటికీ.. విధ్వంసక వీరుడు మిల్లర్‌ (26; 24 బంతుల్లో 1×4, 1×6) కూడా భారీ షాట్లు కొట్టలేకపోవడంతో గుజరాత్‌ 15 ఓవర్లలో 92/3తో నిలిచింది. తర్వాతి ఓవర్లో హోల్డర్‌ బౌలింగ్‌లో మిల్లర్‌ సిక్స్‌ కొట్టాడు. ఇన్నింగ్స్‌లో నమోదైన ఏకైక సిక్స్‌ అది. అయితే ఆదే ఓవర్లో ఆఖరి బంతికి మిల్లర్‌ ఔట్‌ కావడంతో 52 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్‌ తెవాతియా (22 నాటౌట్‌; 16 బంతుల్లో 4×4) దూకుడుతో చివరి నాలుగు ఓవర్లలో 41 పరుగులు రాబట్టిన గుజరాత్‌.. గౌరవప్రదమైన స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది. చమీర బౌలింగ్‌లో గిల్‌ రెండు ఫోర్లు కొట్టగా.. హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో తెవాతియా మూడు ఫోర్లు దంచేశాడు. 20వ ఓవర్లో 16 పరుగులొచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని