GT vs CSK: చెలరేగిన సుదర్శన్‌.. చెన్నై విజయలక్ష్యం 215

ఐపీఎల్‌-16 ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.

Updated : 29 May 2023 21:29 IST

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-16 ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. తొలి డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌ (96; 47 బంతుల్లో 8×4, 6×6) చెలరేగి ఆడటంతో గుజరాత్‌ భారీ స్కోరే చేసింది. ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (54; 39 బంతుల్లో 5×4,1×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ (39; 20 బంతుల్లో 7×4) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. చెన్నై బౌలర్లలో పతిరన 2 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌ చెరో వికెట్‌  తీశారు.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది. తొలి ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. మ్యాచ్‌ ప్రారంభదశలోనే ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు అదృష్టం కలిసొచ్చింది. తుషార్‌ దేశ్‌ పాండే వేసిన 1.4వ బంతికి గిల్‌ భారీ షాట్‌ ఆడాడు. బంతి దీపక్‌ చాహర్‌ చేతికి చిక్కి కిందపడటంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గిల్‌.. తుషార్‌ వేసిన నాలుగో ఓవర్లో హ్యాట్రిక్‌ బౌండరీలు బాదాడు. మెరుపు షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అతడికి వృద్ధిమాన్‌ సాహా చక్కని సహకారం అందించాడు. శుభ్‌మన్‌ వేగానికి రవీంద్ర జడేజా బ్రేక్ వేశాడు. ఆరో ఓవర్‌ చివరి బంతికి ధోనీ అద్భుతంగా స్టంపౌట్‌ చేసి పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత వృద్ధిమాన్‌ సాహా తన భుజాలపై వేసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అయితే, దీపక్‌ చాహర్‌ వేసిన 14వ ఓవర్‌ చివరి బంతికి కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి సాహా వెనుదిరిగాడు.

సుదర్శన్‌ సెంచరీ మిస్‌..

గుజరాత్‌ ఆటలో సాయి సుదర్శన్‌ ఇన్నింగ్సే హైలైట్‌. కేవలం 47 బంతులను ఎదుర్కొన్న సుదర్శన్‌ 8 ఫోర్లు, 6 సిక్సర్లతో గుజరాత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఇన్నింగ్స్‌ రూపమే మారిపోయింది. 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్న సుదర్శన్‌.. ఒక్కసారిగా దూకుడు పెంచాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన 17వ ఓవర్‌లో వరుసగా 6,4,4,4 బాదేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పతిరన వేసిన చివరి ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది సెంచరీకి చేరువయ్యాడు. కానీ, తర్వాతి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (21*, 12 బంతుల్లో 2×4) పరుగులు చేశాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు