Gujarat vs Kolkata: ఉత్కంఠపోరులో గుజరాత్‌దే విజయం.. అగ్రస్థానంలోకి హార్దిక్‌ సేన

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (19), ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (14) వేగంగా పరుగులు చేస్తున్నారు. రెండో ఓవర్‌లోనే శుభ్‌మన్‌గిల్‌ (7) వికెట్‌ కోల్పోయినా...

Updated : 23 Apr 2022 20:18 IST

ముంబయి: ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై గుజరాత్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 18 పరుగులు సాధించాల్సి ఉండగా.. అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఆండ్రూ రస్సెల్ (48) సిక్స్‌ కొట్టి ఆశలు రేపాడు. అయితే రెండో బంతికే ఫెర్గూసన్ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. మిగతా నాలుగు బంతుల్లో కేవలం మూడు పరుగులే రావడంతో విజయం గుజరాత్‌ వశమైంది. ఈ విజయంతో మరోసారి గుజరాత్ (12) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 156/9 స్కోరు సాధించగా.. కోల్‌కతా 148/8 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్ 2, షమీ 2, యశ్‌ దయాల్ 2.. అల్జారీ జోసెఫ్‌, లాకీ ఫెర్గూసన్‌ చెరో వికెట్ తీశారు. ప్రస్తుత సీజన్‌లో గుజరాత్‌ చివరి ఓవర్‌ వరకు వెళ్లి నాలుగో విజయం సాధించడం విశేషం. 


రసవత్తరంగా మ్యాచ్‌

కోల్‌కతా, గుజరాత్‌ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 157 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఉమేశ్‌ యాదవ్‌ (4*), ఆండ్రూ రస్సెల్ (24*) ఉన్నారు. గుజరాత్‌ బౌలర్లు స్వల్ప విరామాల్లో వికెట్లు తీయడంతో కోల్‌కతా కష్టాల్లో పడింది. అయితే ఆండ్రూ రస్సెల్‌ ఉండటంతో ఆశలన్నీ అతడిపైనే ఉన్నాయి. కోల్‌కతా విజయానికి 24 బంతుల్లో 45 పరుగులు కావాలి.


ఇంకెన్ని కొట్టాలంటే?

కోల్‌కతా బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. 157 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజ్‌లో వెంకటేశ్‌ అయ్యర్ (15*), రింకు సింగ్ (29*) ఉన్నారు. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేస్తున్నప్పటికీ వీరిద్దరూ ఇప్పటి వరకు 38 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇంకా కోల్‌కతా విజయానికి 54 బంతుల్లో 85 పరుగులు కావాలి.


స్వల్ప వ్యవధిలో వికెట్లు

లక్ష్యం చిన్నదైనా కోల్‌కతా మాత్రం ఇబ్బంది పడుతోంది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో పరుగుల కోసం శ్రమిస్తోంది. ఓపెనర్లతో సహా నితీశ్‌ రాణా (2) పెవిలియన్‌కు చేరడంతో పవర్‌ప్లేలోనే మూడు వికెట్లను చేజార్చుకుంది. అనంతరం కాస్త ఆచితూచి ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌ (12) వికెట్‌నూ కోల్‌కతా చేజార్చుకుంది. దీంతో ప్రస్తుతం ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నాలుగు వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజ్‌లో వెంకటేశ్‌ అయ్యర్ (1*), రింకు సింగ్ (13*) ఉన్నారు. ఇంకా కోల్‌కతా విజయానికి 78 బంతుల్లో 116 పరుగులు కావాలి. 


తొలి ఓవర్‌లోనే వికెట్

గుజరాత్ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు తొలి ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్‌ సామ్‌ బిల్లింగ్స్‌ (4) షమీ బౌలింగ్‌లో కీపర్ సాహా చేతికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం కోల్‌కతా రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజ్‌లో సునిల్ నరైన్ (4*), శ్రేయస్ అయ్యర్ (0*)  ఉన్నారు. గుజరాత్ స్కోరు 156/9.


రస్సెల్‌ విజృంభణ

భారీ స్కోరు చేస్తుందని భావించిన గుజరాత్‌కు కోల్‌కతా బౌలర్లు అడ్డుకట్ట వేశారు. స్వల్ప వ్యవధిలో వికెట్లను తీస్తూ గుజరాత్‌పై ఒత్తిడి పెంచారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతాకు 157 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (67) అర్ధశతకం సాధించగా.. డేవిడ్ మిల్లర్‌ (27), వృద్ధిమాన్‌ సాహా (25), రాహుల్ తెవాతియా (17) ఫర్వాలేదనిపించారు. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో ఆండ్రూ రస్సెల్‌ (1-0-5-4) కేవలం ఐదు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లను తీశాడు. మిగతా బౌలర్లలో టిమ్ సౌథీ 3.. ఉమేశ్ యాదవ్‌, శివమ్‌ మావి చెరో వికెట్ తీశారు.


దూకుడుగా బ్యాటింగ్‌..

గుజరాత్ బ్యాటర్లు దూకుడు పెంచుతున్నారు. మరీ ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ (25*) వేగంగా పరుగులు చేస్తున్నాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజ్‌లో మిల్లర్‌తోపాటు అర్ధశతకం సాధించిన కెప్టెన్‌ హార్దిక్ పాండ్య (63*) ఉన్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. వికెట్లు ఉండటంతో చివరి ఐదు ఓవర్లలో ధాటిగా ఆడి కోల్‌కతా ఎదుట భారీ లక్ష్యం ఉంచేందుకు ప్రయత్నించాలి. 


అర్ధశతకం దిశగా..

గుజరాత్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (46*) ధాటిగా ఆడటంతో ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. క్రీజ్‌లో పాండ్యతోపాటు వృద్ధిమాన్‌ సాహా (21*) ఉన్నాడు. 8 పరుగులకే వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌ను వీరిద్దరూ కలిసి ఆదుకున్నారు. ఇప్పటికే అర్ధశతక (70) భాగస్వామ్యం నిర్మించారు. కోల్‌కతా బౌలర్లు శ్రమిస్తున్నా వికెట్ మాత్రం దొరకడం లేదు.


రెండో ఓవర్‌లోనే వికెట్..

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (19), ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (14) వేగంగా పరుగులు చేస్తున్నారు. రెండో ఓవర్‌లోనే శుభ్‌మన్‌గిల్‌ (7) వికెట్‌ కోల్పోయినా వీరిద్దరూ ఎలాంటి తడబాటు లేకుండా ధాటిగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలతో హోరెత్తిస్తున్నారు. దీంతో ఐదు ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌ 43/1గా నమోదైంది.


ఆదిలోనే ఎదురుదెబ్బ..

ఆదిలోనే గుజరాత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ (7) పరుగులకే ఔటయ్యాడు. టిమ్‌సౌథీ వేసిన రెండో ఓవర్‌ తొలి బంతిని లెగ్‌సైడ్‌ ఆడబోయి వికెట్ల వెనుక కీపర్‌ చేతికి చిక్కాడు. దీంతో గుజరాత్‌ 8 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు ఉమేశ్‌ యాదవ్‌ వేసిన తొలి ఓవర్‌లో ఆ జట్టు 8 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో వృద్ధిమాన్‌ సాహా, కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ఉన్నారు. మరోవైపు పాండ్య (10) వచ్చీ రాగానే రెండో ఓవర్‌లో రెండు బౌండరీలు బాది జోరుమీద కనిపిస్తున్నాడు. దీంతో 2 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 19/1గా నమోదైంది.


విజయ్‌ శంకర్‌ ఔట్‌.. పాండ్య ఇన్‌..

గత మ్యాచ్‌లో గాయం కారణంగా ఆటకు దూరమైన గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. అతడి స్థానంలో విజయ్‌ శంకర్‌ను పక్కనపెట్టారు. ప్రస్తుతం గుజరాత్‌ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఓటమిపాలై మిగతా ఐదూ గెలిచింది. ఇంతకుముందు చెన్నైతో జరిగిన పోరులో రషీద్‌ ఖాన్‌ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.


టాస్‌ నెగ్గిన గుజరాత్

ముంబయి: కోల్‌కతాతో మరికాసేపట్లో ప్రారంభంకానున్న మ్యాచ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇంతకుముందు మ్యాచ్‌లో గాయం కారణంగా ఆడలేని అతడు మళ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ టాప్‌లోకి వెళ్లాలని చూస్తోంది. మరోవైపు కోల్‌కతా ఏడో స్థానంలో ఉండగా ఈరోజు విజయం సాధించి ముందుకు వెళ్లాలని చూస్తోంది. దాదాపు 35 మ్యాచ్‌ల తర్వాత టాస్‌ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోవడం విశేషం.

గుజరాత్‌ జట్టు: వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌గిల్‌, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), అభినవ్‌ మనోహర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, అల్‌జారీ జోసెఫ్‌, లాకీ ఫెర్గూసన్‌, యశ్‌ దయాల్‌, మహ్మద్ షమి.

కోల్‌కతా జట్టు: వెంకటేశ్‌ అయ్యర్‌, సునీల్‌ నరైన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), నితీశ్‌ రాణా, సామ్‌ బిల్లింగ్స్‌, రింకూ సింగ్‌, ఆండ్రీ రసెల్‌, టిమ్‌ సౌథీ, శివమ్‌ మావి, ఉమేశ్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని