ప్లాన్లేమీ లేవ్‌‌..బయటికొచ్చి బాదడమే: శార్దూల్‌

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో శార్దూల్‌ ఠాకూర్‌ ఇన్నింగ్స్‌ ఎంతో ప్రత్యేకం. అంతకుముందు వరకు బౌలర్‌గానే అతడిపై అందరికీ అంచనాలు ఉన్నాయి. కానీ తొలి ఇన్నింగ్స్‌లో 188/6 స్కోరుతో జట్టు కష్టాల్లో....

Published : 27 Jan 2021 02:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో శార్దూల్‌ ఠాకూర్‌ ఇన్నింగ్స్‌ ఎంతో ప్రత్యేకం. అంతకుముందు వరకు బౌలర్‌గానే అతడిపై అందరికీ అంచనాలు ఉన్నాయి. కానీ తొలి ఇన్నింగ్స్‌లో 188/6 స్కోరుతో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సుందర్‌తో కలిసి గొప్పగా ఆదుకున్నాడు. ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేస్తూ అర్ధశతకం సాధించాడు. అంతేగాక అతడు ఆడిన షాట్‌లు, ఫుట్‌వర్క్‌ను క్రికెటర్లు, మాజీలు కొనియాడారు. పేసర్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో హుక్‌షాట్‌తో సిక్సర్‌ బాది పరుగుల ఖాతా తెరవడం, స్పిన్నర్‌ లైయన్‌ బౌలింగ్‌లో లాఫ్టెడ్‌ షాట్‌తో మరో సిక్సర్‌తో హాఫ్‌సెంచరీ అందుకోవడం హైలైట్.

అయితే సిక్సర్ల కోసం ముందే ఎలాంటి ప్రణాళికలు చేసుకోలేదని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శార్దూల్ ఠాకూర్‌ తెలిపాడు. ‘‘లైయన్‌ బౌలింగ్‌లో ఎన్నో బంతులు డిఫెండ్ చేశా. అతడు కొన్ని ఫ్లైటెడ్‌ డెలివరీలు విసురుతున్నాడు. అతడు చక్కగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఫ్లాట్‌గా, నాకు దూరంగా సంధిస్తున్నాడు. దీంతో పరుగులు సాధించలేకపోయా. అంతేగాక లెగ్‌సైడ్‌లో బౌండరీ లైన్‌లో ముగ్గురు ఫీల్డర్లను మొహరించాడు. దీంతో భారీ షాట్లు ఆడటానికి సంకోచించా’’ అని పేర్కొన్నాడు.

‘‘కానీ నా ఫుట్‌వర్క్‌ను‌ మారుస్తూ ఆడాను. ఫ్రంట్‌ ఫుట్‌, బ్యాక్‌ఫుట్‌తో బంతులు ఎదుర్కొన్నాను. దీంతో అతడి బౌలింగ్‌ను అర్థం చేసుకున్నాను. ఇక సిక్సర్‌ విషయానికొస్తే...దాని కోసం ఎలాంటి ప్లాన్‌ చేయలేదు. బంతి వేస్తున్నప్పుడు క్రీజు నుంచి బయటకి వచ్చి భారీషాట్ ఆడానంతే. అంతకుముందు అలాంటి బంతుల్ని ఎదుర్కొన్నా. దీంతో భారీషాట్ ఆడటానికి ఇదే సరైన సమయమని భావించా. అది స్టాండ్స్‌లోకి వెళ్లింది. అర్ధశతకం పూరైంది’’ అని అన్నాడు. బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో శార్దూల్ అర్ధశతకంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

అతడిపై అంచనాలు వద్దు..ఒత్తిడి పెంచొద్దు: గంభీర్‌

ఎవరడిగినా భారతీయులమని గర్వంగా చెబుతాం.. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని