రూట్‌లా ఆ జట్టులో సగం మంది స్పిన్‌ ఆడలేరు

వందో టెస్టులో జో రూట్‌ ద్విశతకం చేయడం అద్భుతమని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. తమ జట్టులో సగం మంది బ్యాట్స్‌మెన్‌ సైతం అతడిలా స్పిన్‌ను ఎదుర్కోలేరని పేర్కొన్నాడు. అతడెంతో వినయశీలి, స్నేహశీలి అని కొనియాడాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచాడని వెల్లడించాడు....

Updated : 07 Feb 2021 04:54 IST

చెన్నై: వందో టెస్టులో జో రూట్‌ ద్విశతకం చేయడం అద్భుతమని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. తమ జట్టులో సగం మంది బ్యాట్స్‌మెన్‌ సైతం అతడిలా స్పిన్‌ను ఎదుర్కోలేరని పేర్కొన్నాడు. అతడెంతో వినయశీలి, స్నేహశీలి అని కొనియాడాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచాడని వెల్లడించాడు. చెపాక్‌లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత స్టోక్స్‌ మీడియాతో మాట్లాడాడు.

సిక్సర్‌తో రూట్‌ ద్విశతకం చేయడం ఆశ్చర్యంతో పాటు నవ్వు తెప్పించిందని స్టోక్స్‌ అన్నాడు. ‘అవును, అలా చేయడం కాస్త నవ్వు తెప్పించింది. క్రీజులోంచి ముందుకు కదిలి సిక్సర్‌ కొట్టి ద్విశతకం చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అత్యంత తేలిగ్గా ఆడేస్తున్నాడు. అతడు స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించడం ఎంతో బాగుంది. బౌలర్లు వేసే ప్రతి బంతికి అతడి వద్ద సమాధానం ఉంది’ అని స్టోక్స్‌ అన్నాడు.

విరామం తర్వాత తాను జట్టుతో కలవడం, పరుగులు చేయడం సంతోషాన్నిచ్చిందని స్టోక్స్‌ తెలిపాడు. ప్రస్తుతం తాము పటిష్ఠ స్థితిలో (555/8) ఉన్నామని పేర్కొన్నాడు. ఆదివారం మరో రెండు గంటలు బ్యాటింగ్‌ చేస్తే జట్టు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని వెల్లడించాడు. మ్యాచు గెలిచి వందో టెస్టు ఆడుతున్న రూట్‌కు దీనిని ప్రత్యేకంగా మార్చాలని భావిస్తున్నామన్నాడు. అతడు ఎంతో వినయ శీలి, స్నేహశీలి అని వెల్లడించాడు.

‘కొన్నేళ్ల క్రితం నేను గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. అప్పుడతను యాషెస్‌ సిరీసు ఆడుతున్నా నాకు సన్నిహితంగానే ఉన్నాడు. ఎంతో మంది వ్యతిరేకిస్తున్నా నా వెన్ను తట్టాడు. ఇంటా, బయటా నన్ను నిందిస్తున్న సమయం అది. ఆసీస్‌లో రూట్‌ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ నాతో నిరంతరం టచ్‌లో ఉన్నాడు. అందుకే అతడి కోసం నేనేమైనా చేస్తాను. అతడికి నేను వైస్‌ కెప్టెన్గా ఉన్నందుకు సంతోషిస్తున్నాను’ అని స్టోక్స్‌ తెలిపాడు.

ఇవీ చదవండి
‘రూట్’‌ను తప్పించడం ఎందుకింత కష్టం!
సీన్‌ రిపీట్‌: ఇంగ్లాండ్‌దే పైచేయి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని