IND vs SA: అయ్యర్‌ కంటే ముందే విహారిని బ్యాటింగ్‌కు పంపాలి : సంజయ్‌ బంగర్‌

విదేశీ పిచ్‌లపై హనుమ విహారికి మెరుగైన రికార్డు ఉందని మాజీ బ్యాటింగ్ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. అందుకే దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో అతడిని శ్రేయస్‌ అయ్యర్‌..

Published : 14 Dec 2021 01:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విదేశీ పిచ్‌లపై హనుమ విహారికి మెరుగైన రికార్డు ఉందని మాజీ బ్యాటింగ్ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. అందుకే దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో అతడిని శ్రేయస్‌ అయ్యర్‌ కంటే ముందే బ్యాటింగ్‌కు పంపించాలని సూచించాడు. అక్కడి కఠిన పిచ్‌లపై కూడా విహారి సమర్థంగా రాణించగలడని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు టెస్టుల సిరీస్ కోసం విహారిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, అరంగేట్ర టెస్టులోనే అద్భుత శతకంతో ఆకట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్ కూడా దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రేయస్‌.. ఒక శతకం, ఒక అర్ధ శతకంతో రాణించాడు.

‘దక్షిణాఫ్రికాతో జరుగనున్న టెస్టు సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, హనుమ విహారి ఇద్దరూ తుది జట్టులో చోటు దక్కించుకుని.. ఎవరిని ముందుగా బ్యాటింగ్‌కు పంపించాలన్న సంధిగ్ధ పరిస్థితి నెలకొంటే.. కచ్చితంగా విహారినే ముందుగా బ్యాటింగ్‌కు పంపించాలి. ఎందుకంటే అతడు విదేశీ పిచ్‌లపై మెరుగ్గా రాణించగలడు. కఠినమైన పిచ్‌లపై కూడా నిలకడగా ఆడగలడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విహారి శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సంయమనంతో ఆడుతూ టీమ్‌ఇండియాను ఓటమి నుంచి తప్పించాడు’ అని సంజయ్‌ బంగర్‌ పేర్కొన్నాడు. 

ఇప్పటి వరకు 12 టెస్టు మ్యాచులు ఆడిన హనుమ విహారి.. 32.84 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం పాటు నాలుగు అర్ధ శతకాలున్నాయి. మరోవైపు, ఇప్పటి వరకు విహారి ఆడిన 12 టెస్టు మ్యాచులు కూడా విదేశాల్లోనే కావడం విశేషం. ఆస్ట్రేలియాలో ఆరు, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ల్లో రెండేసి, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాల్లో ఒక్కో మ్యాచ్‌ ఆడాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని