ఆస్పత్రిలో బెడ్‌ దొరకడం కష్టమని ఊహించలేదు 

ఆస్పత్రిలో పడక దొరక్కపోవడం అనేది ఎప్పుడూ ఊహించలేదని టీమ్‌ఇండియా క్రికెటర్‌ హనుమ విహారి అన్నాడు. కౌంటీ క్రికెట్‌ ఆడటానికి ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న అతడు తన స్నేహితులు...

Published : 14 May 2021 23:37 IST

కరోనా సెకండ్‌ వేవ్‌పై హనుమ విహారి..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్పత్రిలో పడక దొరక్కపోవడం అనేది ఎప్పుడూ ఊహించలేదని టీమ్‌ఇండియా క్రికెటర్‌ హనుమ విహారి అన్నాడు. కౌంటీ క్రికెట్‌ ఆడటానికి ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న అతడు తన స్నేహితులు, తెలిసిన వ్యక్తుల ద్వారా అనేక మంది కొవిడ్‌ బాధితులకు సహాయం చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఎవరు ఏ సహాయం కావాలని విన్నవించినా తన బృందంతో కలిసి ఈ ఆంధ్రా క్రికెటర్‌ తనవంతుగా సేవ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విశేషాలు పంచుకున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం..

‘నేను ప్రచారం కోసం ఈ పని చేయదల్చుకోలేదు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నా లక్ష్యం ఏమిటంటే.. ఎవరైతే ప్లాస్మా సర్దుబాటు చేసుకోలేరో వారికది అందించడం, ఆస్పత్రుల్లో పడకలు ఏర్పాటు చేయడం, మందులు కొనలేని వారికి సాయం చేయడం. ఈ కరోనా సెంకండ్‌ వేవ్‌ చాలా తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల్లో పడకలు దొరకడం చాలా కష్టంగా ఉంది. వీటి గురించి ఆలోచించాలి. అందువల్లే నా వాలంటీర్లతో కలిసి ప్రజలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నా. కానీ, ఇప్పుడు చేస్తున్నది సరిపోదు. భవిష్యత్‌లో మరింత ఎక్కువ సేవ చేయాలని ఉంది’ అని విహారి అన్నాడు.

‘అందుకోసం నా సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నా. అందరూ మంచిపని చేయడంతో ఇతరులు కూడా స్ఫూర్తి పొంది తమవంతుగా ముందుకు వచ్చారు. అలా మొత్తం 100 మంది వాలంటీర్లతో ఒక వాట్సాప్‌ బృందాన్ని ఏర్పాటు చేశాం. వాళ్ల కష్టంతోనే కొంత మందికి సాయం చేయగలిగా. తొలుత నేను ఒక్కడిగా ప్రారంభించా. తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా అనేక మంది స్నేహితులు ముందుకొచ్చారు. సాయం కోసం నాకు వచ్చే అభ్యర్థనలను వారికి చేరవేస్తా. క్షేత్రస్థాయిలో వారిని కనుగొని వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చూస్తారు. ఏదైనా అత్యవసరమైతే నేను సామాజిక మాధ్యమాల ద్వారా చొరవ తీసుకొని సాయం కోసం కోరతా. ఇందులో నా భార్య, సోదరితో పాటు కొంతమంది ఆంధ్రా క్రికెట్‌ టీమ్‌ సభ్యులు కూడా పాలుపంచుకున్నారు. వాళ్ల మద్దతు కూడా లభించడం చాలా ఆనందంగా ఉంది’ అని విహారి వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు