శిఖర్‌.. వాటిని దాటేశాడు: సన్నీ

టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఫామ్‌లోకి రావడం సంతోషకరమని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. అతడి వయసుపై వచ్చిన విమర్శలన్నీ కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో అతడు ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు....

Published : 24 Mar 2021 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఫామ్‌లోకి రావడం సంతోషకరమని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. అతడి వయసుపై వచ్చిన విమర్శలన్నీ కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో అతడు ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ మ్యాచులో గబ్బర్‌ 98 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

‘అవును, శిఖర్‌ వయసుపై చాలా చర్చ జరిగింది. అతనికిప్పుడు 35 ఏళ్లు. డిసెంబర్లో 36వ వసంతంలోకి అడుగుపెడతాడు. మరి 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు అతడు ఉంటాడా? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి అతడు తన ఆటపై దృష్టిపెట్టడం, పరుగులు చేయడం సంతోషకరం’ అని సన్నీ అన్నారు. ‘రోహిత్‌శర్మతో కలిసి ధావన్‌ విధ్వంసకరమైన భాగస్వామ్యాలు ఇచ్చాడు. జట్టుకు ఎన్నోసార్లు మేలు చేశాడు’ అని ప్రశంసించారు.

క్రీజులో ఎక్కువ సమయం గడపడం, బంతిని చక్కగా మిడిల్‌ చేయడంతో ధావన్‌ ఆత్మవిశ్వాసం పెరిగిందని గావస్కర్‌ అన్నారు. మ్యాచులో అతడు 11 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడని పేర్కొన్నారు. ‘రోహిత్‌ సాధారణంగా ఆడేంత బాగా ఈ సారి ఆడలేకపోయాడు. అందుకే శిఖర్‌ ధావన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నాడు. కొన్ని షాట్లను మిడిల్‌ చేశాక అతడిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. ఆ తర్వాత తన సామర్థ్యం మేరకు షాట్లు బాదేశాడు. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా బాదిన సిక్సర్‌ అద్భుతం. శ్రమించే, కెప్టెన్‌ కోహ్లీ అన్నట్టు జట్టు మనిషైన ధావన్‌ విజయవంతం కావడం సంతోషకరం’ అని సన్నీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని