T20 WorldCup: రోహిత్‌ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ

రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమ్‌ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్‌ గంగూలీ కితాబిచ్చారు.

Published : 29 Jun 2024 00:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రోహిత్‌శర్మ (Rohit Sharma) సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో (T20World Cup) భారత్‌ దూసుకుపోవడం చాలా సంతోషంగా ఉందని టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) అన్నారు. దక్షిణాఫ్రికాతో జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో ఏ మాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఆడాలని సలహా ఇచ్చారు. భారత్‌ 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో విజయం సాధించి చివరిసారిగా అంతర్జాతీయ ట్రోఫీ అందుకున్నట్లు గుర్తు చేసిన గంగూలీ.. 11ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి చెబుతూ ఈసారి కప్‌ను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ‘‘ రోహిత్‌ శర్మను చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆయన జీవితం సంపూర్ణమైంది. ప్రపంచ ట్రోఫీలో అతడి సారథ్యంలోని టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరింది’’ అని గంగూలీ కొనియాడారు.

అయిష్టంగానే బాధ్యతలు

విరాట్‌ కోహ్లీ సారథ్య బాధ్యతలు వదులుకున్న తర్వాత అయిష్టంగానే రోహిత్‌ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడని గంగూలీ గుర్తు చేశారు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రోహిత్‌ కెప్టెన్సీ స్వీకరించాడని చెప్పిన గంగూలీ.. అతడి సారథ్య సామర్థ్యాలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని చెప్పారు. ‘‘ నిజానికి రోహిత్‌కు కెప్టెన్సీ ఇష్టం లేదు. ఒప్పించేందుకు మేమంతా చాలా తంటాలు పడ్డాం. బలవంతంగా ఒప్పించాం. ఇప్పుడు అతడి సారథ్యంలోని జట్టు పురోగమిస్తుంటే పట్టలేని ఆనందంగా ఉంది’’  అని అన్నారు.

లక్‌ కూడా ఉండాలి

సుదీర్ఘ సమయం కొనసాగడం వల్ల ఐపీఎల్‌ టోర్నీలో విజేతగా నిలవడం కొన్నిసార్లు కష్టమనిపిస్తుందన్న గంగూలీ.. ఐదుసార్లు రోహిత్‌ సేన ఈ ట్రోఫీని సొంతం చేసుకున్నట్లు గుర్తు చేశారు. ‘‘ ఐపీఎల్‌లో విజయం సాధించాలంటే కనీసం 16-17 మ్యాచుల్లో గెలుపొందాలి. అదే టీ20 ప్రపంచకప్‌లో 8-9 మ్యాచ్‌లు గెలిస్తే చాలు. అలాగని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కంటే.. ఐపీఎల్‌ ఉత్తమమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఐపీఎల్‌తో పోలిస్తే... ఈ ట్రోఫీ గెలిస్తే వచ్చే గౌరవం ఎక్కువ. శనివారం జరగబోయే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా దానిని సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నా. ఏడు నెలల వ్యవధిలో రెండు ప్రపంచకప్‌లను చేజార్చుకుంటుందని అనుకోవడం లేదు. రోహిత్‌ ముందుండి జట్టును నడిపిస్తున్నారు. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫైనల్‌లోనూ ఒత్తిడికి గురికాకుండా అదే కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. వారికి లక్‌ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద టోర్నీల్లో గెలవాలంటే లక్‌ కూడా ఉండాలి’’ అని గంగూలీ చెప్పుకొచ్చారు.

విరాట్‌ ఓపెనర్‌గానే రావాలి

విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గానే రావాలని గంగూలీ అన్నారు. ఎవరైనా సరే కొన్నిసార్లు విఫలమవ్వడం సహజమేనని చెప్పారు. కొన్ని నెలల ముందే జరిగిన ప్రపంచకప్‌ టోర్నీలో 700 పరుగులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మూడు నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన సత్తా లేదన్నట్లు చూడకూడదని వ్యాఖ్యానించారు. కోహ్లీ, సచిన్‌ తెందూల్కర్‌, రాహుల్‌ ద్రావిడ్‌ లాంటి వ్యక్తులు ఇండియన్‌ క్రికెట్‌కు ఇన్‌స్టిట్యూట్‌లాంటివారని కితాబిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని