టీ20 లీగ్‌లో ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్‌.. దాయాదుల పోరే : హర్భజన్‌ సింగ్‌

 ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్‌లో చెన్నై, ముంబయి జట్ల మధ్య మ్యాచ్‌ కోసం 

Published : 21 Apr 2022 17:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్‌లో చెన్నై, ముంబయి జట్ల మధ్య మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్‌పై  టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ తనదైన శైలిలో స్పందించాడు. ముంబయిxచెన్నై జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌ భారత్‌-పాకిస్థాన్‌ పోరును తలపిస్తోందని వ్యాఖ్యానించాడు. ఓ క్రీడా ఛానల్‌తో భజ్జీ మాట్లాడుతూ.. ‘‘నేను రెండు జట్ల తరఫున మ్యాచ్‌లను ఆడాను. రెండు టీమ్‌లు దేనికదే స్పెషల్. అందుకే టీ20 లీగ్‌లో దిగ్గజ జట్ల మధ్య మ్యాచ్‌ అంటే నాకు దాయాదుల పోరే గుర్తుకొస్తుంది. పోటీ  ఆ రేంజ్‌లో ఉంటుంది. సీఎస్‌కే తరఫున ఆడినప్పుడు మ్యాచ్‌ త్వరగా అయిపోవాలని కోరుకునేవాడిని. ఎందుకంటే మ్యాచ్‌లో పోటీనే కాకుండా భావోద్వేగాలతోపాటు ఒత్తిడి అధికంగా ఉంటుంది’’ అని వివరించాడు.

‘‘పదేళ్ల కిందట జరిగిన ముంబయి, చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌ గురించి కూడా అభిమానులు ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. మైదానంలో ఇరు జట్లు పోటీ పడే తీరు అత్యుత్తమంగా ఉంటుంది. టీ20 లీగ్‌లోకెల్లా విభిన్న పోరుగా చెప్పొచ్చు’’ అని సూర్యకుమార్‌ చెప్పాడు. ‘‘మా కుటుంబ సభ్యులు ఫాలో అయ్యే అతిపెద్ద లీగ్‌ కూడా ఇదే. మా అమ్మ తొలి నుంచీ ముంబయి సపోర్టర్. అందుకే ముంబయితో కాంట్రాక్ట్‌ వచ్చినప్పుడు ఎంతో సంతోషించింది. మా నాన్న కోల్‌కతా నుంచి వచ్చారు. ఇప్పుడు అందరూ ముంబయికి షిప్ట్‌ అయిపోయారు. అయితే నా సోదరుడు చెన్నై ఫ్యాన్‌. తప్పకుండా మ్యాచ్‌కు వస్తాడు’’ అని దక్షిణాఫ్రికా యంగ్ ప్లేయర్‌ బ్రెవిస్‌ తెలిపాడు. 

ఆడమ్‌ మిల్నే ఔట్

చెన్నై జట్టుకు బౌలింగ్‌ కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే దీపక్‌ చాహర్‌ గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఆడమ్‌ మిల్నే కూడా తప్పుకున్నాడు. దీంతో శ్రీలంక పేసర్‌ మతీషా పతిరానతో కాంటాక్ట్‌ను చెన్నై యాజమాన్యం కుదుర్చుకుంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో మిల్నే మోకాలికి గాయమైంది. ఇంకా కోలుకోకపోవడంతో ప్రస్తుత సీజన్‌ మొత్తానికి దూరమైనట్లు చెన్నై యాజమాన్యం వెల్లడించింది. అతడి స్థానంలో శ్రీలంక బౌలర్‌ 19 ఏళ్ల మతీషాతో రీప్లేస్‌ చేసుకుంది. గత మెగా వేలంలో రూ. 20 లక్షలకే సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని