Harbhajan - Kamran Akmal: ‘‘నేను పొరపాటు చేశాను. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు’’ : అక్మల్‌

ఇంగ్లాండ్‌ వేదికగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ (Harbhajan Singh), పాక్ మాజీ వికెట్‌కీపర్‌ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) ఎదురుపడ్డారు. 

Updated : 08 Jul 2024 16:58 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌ వేదికగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం (జులై 6న) పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 68 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ (Harbhajan Singh), పాక్ మాజీ వికెట్‌కీపర్‌ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) ఎదురుపడ్డారు. వీరిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్‌ సమయంలో భారత బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh)పై కమ్రాన్‌ అక్మల్‌ జాత్యంహకార వ్యాఖ్యలు చేశాడు. దీనిపై హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) తీవ్రంగా స్పందించాడు. అనంతరం అక్మల్‌ క్షమాపణలు కూడా చెప్పాడు. తాజాగా వీరిద్దరూ ఎదురుపడటంతో ఏం మాట్లాడుకున్నారనే అన్న అంశం ఆసక్తిగా మారింది. తమ మధ్య జరిగిన సంభాషణను కమ్రాన్ అక్మల్‌ తాజాగా బయటపెట్టాడు.

‘‘నేను పొరపాటు చేశాను. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు. నేను చిన్నవాడిని. మీరు (హర్భజన్‌) నాకంటే పెద్దవారు. భారత, ప్రపంచ క్రికెట్‌లోనే గొప్ప ఆఫ్ స్పిన్నర్. నన్ను క్షమించాలి’’ అని హర్భజన్‌ సింగ్‌తో అన్నట్లు కమ్రాన్ అక్మల్ తెలిపాడు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ సమయంలో స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో హర్భజన్ సింగ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అప్పుడు  పాకిస్థాన్‌ బ్యాటర్ బాబర్‌ అజామ్‌, వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా మధ్య పోలిక అంశం వచ్చినప్పుడు బాబర్‌ను హర్భజన్ ఎగతాళి చేశాడు. తాజాగా జరిగిన సంభాషణలో ఈ విషయాన్ని భజ్జీ ముందు ప్రస్తావించినట్లు అక్మల్ పేర్కొన్నాడు. ‘‘బాబర్ పాకిస్థాన్ క్రికెట్‌లో గొప్ప బ్యాట్స్‌మన్. అందులో ఎలాంటి సందేహం లేదు. బాబర్‌ను బ్రియాన్ లారాతో పోల్చకూడదు. అది వాస్తవం. అయితే, క్రికెటర్లుగా మనం ఎవరినీ ఎగతాళి చేయకూడదు. కాబట్టి నేను దాని గురించి ప్రస్తావించా.’’ అని కమ్రాన్ అక్మల్‌ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని