Virat Kohli: ‘సచిన్‌ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేస్తాడు’

సచిన్ తెందూల్కర్‌ 100 సెంచరీల రికార్డును టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్రేక్‌ చేస్తాడని భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.

Published : 14 Mar 2023 01:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ  (Virat Kohli) టెస్టుల్లో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. 40 నెలల నిరీక్షణకు తెరదించుతూ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారీ శతకం (186) బాదాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై భారత్ మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh)ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును విరాట్‌ బ్రేక్‌ చేస్తాడని హర్భజన్‌ ధీమా వ్యక్తం చేశాడు. 34 ఏళ్ల పరుగుల రారాజు.. ఫిట్‌నెస్‌పరంగా 24 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు. 

‘ఇది కచ్చితంగా సాధ్యమే. విరాట్ కోహ్లీ అంతకంటే (100 సెంచరీలు) ఎక్కువ  శతకాలు చేయగలడని అనుకుంటున్నాను. ఇక్కడ రెండు విషయాలు విరాట్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి అతని వయస్సు, రెండోది ఫిట్‌నెస్. కోహ్లీ వయస్సు ఇప్పుడు 34. కానీ,  అతని ఫిట్‌నెస్ 24 ఏళ్ల క్రికెటర్‌లా ఉంది. ఫిట్‌నెస్‌పరంగా అతడు చాలా ముందున్నాడు. విరాట్ ఇప్పటికే 75 సెంచరీలు బాదాడు. అతను కనీసం ఇంకా 50 కంటే ఎక్కువ  సెంచరీలు చేస్తాడు. కోహ్లీకి తన ఆట గురించి తెలుసు. అతను అన్ని ఫార్మాట్లలో ఆడతాడు. ఈ విషయంలో నేను అతి విశ్వాసం ప్రదర్శిస్తున్నానని మీరు భావించొచ్చు. కానీ, కచ్చితంగా ఇది సాధ్యమే. ఈ రికార్డును బద్దలుకొట్టేవారు ఎవరైనా ఉన్నారంటే అది విరాట్‌ కోహ్లీనే. మిగిలిన వారంతా అతని వెనుక ఉన్నారు’ అని హర్భజన్ సింగ్ చెప్పాడు. 

ఇక, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గురించి భజ్జీ మాట్లాడాడు. సీఎస్కేకు మహేంద్ర సింగ్‌ ధోనీ అతిపెద్ద బలమని, జట్టుకు అతడు గుండె లాంటి వాడని పేర్కొన్నాడు. రవీంద్ర జడేజా ప్రపంచంలోనే ఉత్తమమైన ఆల్‌రౌండర్‌ అని, వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్కే అతడు కీలకంగా మారతాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని