WTC Finals: ఇషాంత్‌ కాదు.. సిరాజ్‌నే తీసుకోవాలి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మకు బదులు మహ్మద్‌ సిరాజ్‌కు చోటివ్వాలని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు...

Published : 10 Jun 2021 23:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మకు బదులు మహ్మద్‌ సిరాజ్‌కు చోటివ్వాలని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా హైదరాబాద్‌ పేసర్‌ విశేషంగా రాణిస్తున్నాడని, దాంతో అతడిని ఎంపికచేయాలని అభిప్రాయపడ్డాడు. మరోవైపు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైన యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ తిరిగి గాడిలో పడాలన్నాడు. ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టీమ్‌ఇండియాలో ఎవరుండాలని అడిగిన ప్రశ్నకు భజ్జీ ఇలా చెప్పుకొచ్చాడు.

‘ఒకవేళ నేనే కెప్టెనైతే కచ్చితంగా ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లతో బరిలోకి దిగుతా. అలాంటప్పుడు బుమ్రా, షమి యథాతథంగా జట్టులో ఉంటారు. ఇక్కడ ఇషాంత్‌కు బదులు సిరాజ్‌ను ఎంపిక చేస్తా. ఇషాంత్‌ అద్భతమైన బౌలరైనా ఈ మ్యాచ్‌లో సిరాజ్‌కే నేను ఓటేస్తా. గత రెండేళ్లుగా అతడు విశేషంగా రాణిస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడి ఫామ్‌, పేస్‌, ఆత్మవిశ్వాసంతో పోలిస్తే అతడే సరైన ఆటగాడు. ఇక ఇటీవలి కాలంలో అవకాశాల కోసం ఆకలి మీదున్నట్లు కనిపిస్తున్నాడు. మరోవైపు ఇషాంత్‌ ఇప్పటికే గాయాలబారిన పడినా భారత జట్టుకు ఎంతో సేవలు చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో పచ్చిక ఉంటే సిరాజ్‌ న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం వారికంత తేలిక కాదు. వారిని ముప్పుతిప్పలు పెడతాడు’ అని హర్భజన్‌ వివరించాడు.

అలాగే ఐపీఎల్‌లో సిరాజ్‌ ఆండ్రి రసెల్‌ను ఇబ్బందులు పెట్టాడని, 2019లో అతడి బౌలింగ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ దంచికొడితే ఈసారి అతడిని కట్టడి చేశాడని భజ్జీ గుర్తుచేశాడు. టీమ్‌ఇండియాకు ఆడటం వల్లే సిరాజ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. మరోవైపు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. రోహిత్‌ శర్మతో కలిసి బలమైన ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు ఇవ్వాలని, త్వరగా ఔటై కోహ్లీ, పుజారాలపై భారం పెంచొద్దని హర్భజన్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఆల్‌రౌండర్‌గా జడేజా ఏడో స్థానంలో సరిపోతాడని, ఇంగ్లాండ్‌లో అతడికి మంచి రికార్డే ఉందని వెటరన్‌ స్పిన్నర్‌ గుర్తు చేశాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటే ఫాస్ట్‌ బౌలర్లను రొటేషన్‌ పద్ధతిలో బాగా వినియోగించుకోవచ్చని చెప్పాడు. అయితే, వాతావరణం చల్లగా ఉంటే పిచ్‌ సహకరించదని, దాంతో ఆ స్పిన్నర్లు ఏ మేరకు ప్రభావం చూపిస్తారేది ప్రశ్నార్థకంగా మారుతుందని భజ్జీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని