IPL 2023: వారంతా జాతీయ జట్టుకు ఆడతారు: హర్భజన్‌ సింగ్‌

కుర్రాళ్ల ప్రదర్శన ఈసారి ఐపీఎల్‌లో (IPL 2023) అదిరిపోయింది. కీలక భాగస్వామ్యాలు నిర్మించడమే కాకుండా.. దూకుడుగా ఆడుతూ జట్టుకు ఉపయుక్తంగా మారారు. ఈ క్రమంలో తానెంతో ఇంప్రెస్‌ అయినట్లు హర్భజన్‌సింగ్ వ్యాఖ్యానించాడు..

Published : 25 May 2023 16:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ - 2023 సీజన్‌ (IPL 2023)లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. క్వాలిఫయర్‌ -2, ఫైనల్‌ జరగాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకోగా.. గుజరాత్-ముంబయి జట్లలో ఎవరు తుది పోరుకు అర్హత సాధిస్తారో తెలియాల్సి ఉంది. ప్రస్తుత సీజన్‌లో సీనియర్లతోపాటు యువకులు అద్భుతంగా రాణించారు. శుభ్‌మన్‌ గిల్, రింకు సింగ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, నెహాల్ వధెరా, వెంకటేశ్ అయ్యర్ అదరగొట్టారు. ఇక విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రుతురాజ్‌ గైక్వాడ్ కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌లో అందరికంటే ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చిన ఆటగాడు ఎవరనేది టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ విశ్లేషించాడు. 

‘‘ఇప్పుడు మనం బ్యాటింగ్‌ గురించి మాత్రమే మాట్లాడుకుంటే.. శుభ్‌మన్‌ గిల్ సామర్థ్యం అద్భుతం. అతడిలానే యశస్వి జైస్వాల్ కూడా భారత భవిష్యత్‌ క్రికెట్‌కు కీలకమవుతాడు. తప్పకుండా యశస్వి టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేస్తాడని అనిపిస్తోంది. ఇప్పటికే శుభ్‌మన్‌ గిల్ జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. ఏదొక రోజు కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఇప్పటికిప్పుడు జరుగుతుందని మాత్రం చెప్పను. భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నా. గతేడాది టీ20 ప్రపంచకప్‌ ఓటమి తర్వాత కొత్త జట్టును తయారు చేసుకోవాలనే సూచనలు భారీ స్థాయిలో వచ్చాయి. తిలక్‌ వర్మ, రింకు సింగ్‌ కూడా జట్టులో స్థానం సంపాదిస్తారు. అందుకోసం టీమ్‌ను కూడా సిద్ధం చేశా. బ్యాటర్ల జాబితాను చెబుతున్నా. శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రుతురాజ్‌ గైక్వాడ్, నితీశ్‌ రాణా, తిలక్‌ వర్మతో కూడిన బ్యాటింగ్‌ విభాగానికి హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా ఉండాలి’’ అని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని