Hardik: అక్కడ పొరపాటు చేశాం.. అహ్మదాబాద్‌లో అతడిని చూస్తానని ఆశిస్తున్నా: హార్దిక్‌

గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (GT vs CSK) ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో తమ ఓటమికిగల కారణాలను గుజరాత్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య వెల్లడించాడు.

Published : 24 May 2023 12:30 IST

ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌ (GT) లీగ్‌ స్టేజ్‌లో అదరగొట్టి ప్లేఆఫ్స్‌ చేరింది. అయితే, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో కీలక పోరుకు చేరిన గుజరాత్‌కు చెన్నై సూపర్ కింగ్స్‌ షాక్‌ ఇచ్చింది. చెపాక్‌ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ను ఓడించింది. ఛేదనలో ఎదురులేని గుజరాత్‌.. ఈసారి మాత్రం గెలవలేకపోయింది. ఇందులో ఓడిపోయినా ఫైనల్‌కు చేరుకొనేందుకు గుజరాత్‌కు మరొక అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌ విజేతతో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది. ఈ క్రమంలో చెన్నైపై ఓటమి గురించి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.

‘‘బౌలింగ్‌లో మేం కాస్త అదుపు తప్పినట్లు అనిపించింది. కొన్ని తప్పిదాలు మా ఓటమికి కారణం. అద్భుతమైన బౌలింగ్‌ విభాగం ఉంది. అయినా, 15 పరుగులను అదనంగా ఇచ్చాం. కొన్ని బంతులను సరిగా వేయకపోవడంతోనే చెన్నై బ్యాటర్లు పరుగులు రాబట్టారు. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేసినప్పటికీ.. ఇలా జరిగిపోయింది. అయితే, దీనిపై మరీ ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరో రెండు మూడు రోజుల్లో మ్యాచ్‌ ఆడతాం. ఫైనల్‌కు చేరుకోవాలంటే అదనంగా మరో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఇక ఎంఎస్ ధోనీ వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బౌలర్లను అద్భుతంగా వినియోగించుకుంటాడు. రెండో క్వాలిఫయిర్‌లో గెలిచి ఆదివారం ధోనీతో ఆడితే బాగుంటుందని అనిపిస్తోంది. తప్పకుండా వచ్చే మ్యాచులో గెలుస్తాం. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ను చూస్తా. అహ్మదాబాద్‌లో లఖ్‌నవూ కెప్టెన్‌ కృనాల్ పాండ్యను చూస్తానని ఆశిస్తున్నా’’ అని హార్దిక్‌ తెలిపాడు. 

మరీ ప్రయోగాలకు పోలేదు: దీపక్ చాహర్

చెన్నై సూపర్ కింగ్స్‌ బౌలర్ దీపక్‌ చాహర్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో రెండు వికెట్లు తీసి 29 పరుగులు ఇచ్చాడు. ‘‘గుజరాత్ బౌలింగ్‌ను చూసిన తర్వాత లెంగ్త్‌తో బౌలింగ్‌ చేయాలని భావించాం. అదీనూ ఫుల్‌ లెంగ్త్‌లో సంధిస్తే ఫలితం రాబట్టవచ్చని అర్థమైంది. అందుకే, మరీ ఎక్కువగా ప్రయోగాలకు పోలేదు. 170 పరుగులను ఛేదించడం కష్టమేనని అనిపించింది. గతంలో ప్లేఆఫ్స్‌లో ఆడినప్పుడూ భారీగా వచ్చే ప్రేక్షకుల మధ్య ఆడటం చాలా ఒత్తిడితో కూడుకున్నదే. యువకులకు కేవలం ఒత్తిడిని ఎలా అధిగమించాలనే దానిపైనే సూచనలు చేశా. వారికున్న నైపుణ్యాలపై నమ్మకంతో ఉండాలని చెబుతా. కేవలం ఒక్క బంతి లేదా ఒక్క క్యాచ్‌ మ్యాచ్‌ను మార్చేస్తుంది. ఇప్పటికే మేం చాలాసార్లు ఫైనల్‌కు చేరాం. తప్పకుండా అక్కడా మంచి ప్రదర్శనే చేస్తాం’’ అని చాహర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని