Hardik Pandya: టెస్టుల్లోకి వచ్చేది అప్పుడే.. హార్దిక్‌ పాండ్య ఆసక్తికర సమాధానం

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌, కెప్టెన్‌గా అదరగొడుతున్న హార్దిక్‌ పాండ్య (Hardik Pandya).. కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 అనంతరం..  దీని గురించి పాండ్యను అడగ్గా ఆసక్తికర సమాధానమిచ్చాడు.

Updated : 04 Jan 2023 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) నేతృత్వంలో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టీమ్‌ఇండియా (Team India) టీ20 జట్టుకు శుభారంభం దక్కింది. శ్రీలంక (Srilanks)తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ (IND vs SL)లో 2 పరుగుల తేడాతో హార్దిక్ సేన విజయం సాధించింది. ఈ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఈ ఆల్‌రౌండర్‌.. టెస్టు క్రికెట్‌లో తన పునరాగమనంపై ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

‘‘తెల్ల జెర్సీల్లో మళ్లీ ఎప్పుడు కన్పిస్తానంటే..? ముందు నేను నీలం జెర్సీ(పరిమిత ఓవర్ల ఫార్మాట్‌)లో పూర్తి స్థాయిగా ఆడాలి. ఆ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌ (Test Cricket)పై దృష్టి పెడతా’’ అని పాండ్య తెలిపాడు. అనంతరం కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ఒడుదొడుకుల గురించి స్పందిస్తూ.. ‘‘నాకు ఆట కోసం శ్రమించడం మాత్రమే తెలుసు. ఓ దశలో నేను పతనం అంచుల వరకూ వెళ్లినా.. కష్టపడే గుణమే మళ్లీ నన్ను పైకి తెచ్చింది. నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే మరింత కష్టపడటంపై దృష్టిపెట్టా. ఇక ఆటలో గాయాలు సహజమే. వాటి వల్ల నేనేం మారను. నన్ను ఈ స్థాయికి చేర్చిన కష్టపడేతత్వాన్నే నమ్ముతాను. ఇంకా గొప్పగా ఆడేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని వివరించాడు. 2017లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పాండ్య 2018లో చివరి సారిగా టెస్టు క్రికెట్‌ ఆడాడు. 11 మ్యాచుల్లో 532 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, నాలుగు అర్ధ శతకాలను నమోదు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు.

నిశాంకను బోల్తా కొట్టించిన మావి..

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శివమ్ మావి (Shivam Mavi) తొలి టీ20లో అదరగొట్టాడు. నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని గట్టిగా దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే లంక ఓపెనర్‌ నిశాంకను బోల్తాకొట్టించాడు. ఆ ఓవర్‌లో మావి వేసిన తొలి మూడు బంతుల్లో కుశాల్‌ మెండిస్‌ రెండు ఫోర్లు బాదాడు. కానీ, ఆ తర్వాత స్ట్రైక్‌లోకి వచ్చిన మరో ఓపెనర్‌ నిశాంక.. మావి మెరుపు బౌలింగ్‌ను అంచనా వేయలేకపోయాడు. ఐదో బంతిని ఈ యువ పేసర్‌ నేరుగా వికెట్లకు గిరాటేశాడు. ఇక, మావి వేసిన తర్వాతి ఓవర్‌లో.. లంక ఆటగాడు ధనంజయ డిసిల్వా వరుసగా రెండు ఫోర్లు బాది మూడో బంతికి చిక్కాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని