IPL 2022: హార్దిక్‌ నడిపిస్తాడా?.. రాహుల్‌ మురిపిస్తాడా?

హార్దిక్‌ పాండ్య ఎంత కీలకమైన ఆటగాడో మనకు తెలిసిందే. కపిల్‌దేవ్‌ తర్వాత ఆ స్థాయి నమ్మకమైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ, వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత సైతం సరిగ్గా ఆడలేక...

Updated : 11 Feb 2022 10:56 IST

ఐపీఎల్‌ 2022పై కొత్త ఫ్రాంఛైజీల భారీ అంచనాలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: హార్దిక్‌ పాండ్య ఎంత కీలకమైన ఆటగాడో మనకు తెలిసిందే. కపిల్‌దేవ్‌ తర్వాత ఆ స్థాయి నమ్మకమైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ, వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత సరిగ్గా ఆడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అలాంటి ఆటగాడిని రాబోయే మెగా ఐపీఎల్‌ టోర్నీలో అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీ ‘గుజరాత్‌ టైటాన్స్‌’ కెప్టెన్‌గా నియమించుకుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఎలా రాణిస్తాడు. జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తిగా మారింది. మరోవైపు కేఎల్‌ రాహుల్‌ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్నా కెప్టెన్‌గా ఇప్పటివరకు తనదైన మార్కు చూపించలేదు. గతరెండేళ్లుగా పంజాబ్‌ కింగ్స్‌కు సారథిగా వ్యవహరించినా జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. అయినా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ అతడిపై నమ్మకం ఉంచి జట్టు పగ్గాలు అందజేసింది. దీంతో ఈ ఇద్దరి పరిస్థితి ఇప్పుడెలా ఉందో ఓ లుక్కేద్దాం.

హార్దిక్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా..

ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ 2019 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా రాణించినా తర్వాత వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకొని కొద్దికాలం ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే తిరిగి జాతీయ జట్టులోకి రాగా, ఐపీఎల్‌లోనూ కొనసాగుతున్నాడు. కానీ, ఇంతకుముందులా బ్యాటింగ్‌లో మెరుపులు కనిపించడంలేదు. అడపా దడపా బంతి అందుకున్నా వికెట్లు తీసేలా కనిపించడం లేదు. దీంతో కీలక ఆల్‌రౌండర్‌గా పేరు గడించినా చివరికి సరైన ప్రదర్శన చేయలేక తంటాలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. 2020 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున 281 పరుగులు చేసిన పాండ్య.. గతేడాది 127 పరుగులే చేశాడు. ఈ రెండు సీజన్లలో పూర్తిగా బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఇక గతేడాది చివర్లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ విఫలమయ్యాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో తొలి మూడింటిలోనే బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కినా.. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లపై 11, 23 పరుగులే చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఆ ప్రపంచకప్ తర్వాత మళ్లీ టీమ్ఇండియాకు దూరమైన హార్దిక్‌ పాండ్య నేరుగా రాబోయే ఐపీఎల్‌లోనే మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా నియమించుకుంది. అలాంటిది హార్దిక్‌ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది ఆసక్తిగా మారింది. ముంబయి ఇండియన్స్‌లో కీలక ఆల్‌రౌండర్‌గా వెలుగొందిన అతడు ఇప్పుడు గుజరాత్‌ను ఎలా నడిపిస్తాడో చూడాలి.

రాహుల్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నా..

టీమ్‌ఇండియాలో కేఎల్‌ రాహుల్‌ నిలకడైన బ్యాట్స్‌మన్‌ అనే సంగతి తెలిసిందే. టాప్‌ ఆర్డర్‌ నుంచి మిడిల్‌ ఆర్డర్‌ వరకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు. జట్టు పరిస్థితులకు తగ్గట్టు ఆటలో గేర్లు మార్చగల నైపుణ్యం అతడి సొంతం. అలాగే అవసరమైతే వికెట్‌ కీపింగ్‌ కూడా చేయగలడు. ఇలాంటి మేటి ఆటగాడు.. గత పది మ్యాచ్‌ల్లో (మూడు టీ20లు, మూడు టెస్టులు, నాలుగు వన్డేలు) మొత్తం 485 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. వీటిల్లో అతడి సగటు 48.5గా ఉంది. మరోవైపు గత నాలుగు ఐపీఎల్‌ సీజన్లలోనూ బ్యాటింగ్‌లో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. మొత్తం 2,548 పరుగులు చేసి ఏటా సగటున 600 పైచిలుకు పరుగులు చేస్తున్నాడు. అయితే.. వ్యక్తిగతంగా ఎంత బాగా ఆడుతున్నా..  కెప్టెన్సీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అందుకు నిదర్శనం ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో పంజాబ్‌ను సరిగ్గా నడిపించలేకపోవడం.. మరోవైపు ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డేల్లో టీమ్‌ఇండియాను ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిపించలేకపోవడం. దీంతో అతడు కెప్టెన్‌గా ఆకట్టుకోలేకపోతున్నాడనే భావన అందరిలోనూ కలుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనూ అతడిపై భారీ అంచనాలు పెట్టుకున్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ రాబోయే మెగా టోర్నీ కోసం కెప్టెన్‌గా తీసుకుంది. అయితే, రాహుల్‌ ఆ జట్టు నమ్మకాన్ని నిలబెడతాడా..? లేదా? చూడాలి. ఈ కొత్త జట్టును కనీసం ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లినా అతడు విజయవంతమైనట్టే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని