Hardik Pandya: ‘హార్దిక్‌కు ఏం చెయ్యాలో తెలుసు.. కోచ్‌లు చెప్పాల్సిన అవసరం లేదు’

భారత టీ20 లీగ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్‌లోనే జట్టు (గుజరాత్‌)ని ఛాంపియన్‌గా నిలిపి అందరి ప్రశంసలు అందుకున్నాడు హార్దిక్ పాండ్య (Hardik Pandya).ఈ టీ20 మెగా లీగ్‌లో హార్దిక్ కెప్టెన్‌గానే కాకుండా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో

Published : 18 Jun 2022 02:11 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 లీగ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్‌లోనే జట్టు (గుజరాత్‌)ను ఛాంపియన్‌గా నిలిపి అందరి ప్రశంసలు అందుకున్నాడు హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఈ టీ20 మెగా లీగ్‌లో హార్దిక్ కెప్టెన్‌గానే కాకుండా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. దీంతో తిరిగి భారత జట్టుకు ఎంపికయ్యాడు అతను. సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్య.. త్వరలో ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ అనంతరం హార్దిక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యపై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్ మెక్‌గ్రాత్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్‌కి ఇప్పుడు చాలా అనుభవం వచ్చిందని, అతడు ఏం చేయాలో కోచ్‌లు చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

‘హార్దిక్‌కి ఇప్పుడు చాలా అనుభవం ఉంది. ఏం చేయాలో అతడికి తెలుసు. కోచ్‌లు చెప్పాల్సిన అవసరం లేదు. హార్దిక్ పాండ్య నాణ్యమైన ఆల్‌రౌండర్, హిట్టర్. కొన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆడతాడు. మరికొన్నింటిలో ఆడలేడు. మొత్తం మీద అతడు ఏమి చేయాలనే విషయంపై అతడికి స్పష్టత ఉంది’ అని మెక్‌గ్రాత్‌ పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన భారత టీ20 లీగ్‌లో హార్దిక్ పాండ్య 15 మ్యాచ్‌ల్లో 487 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. చాలాకాలం తర్వాత పూర్తిస్థాయిలో బౌలింగ్‌ కూడా చేయగల్గుతున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపిస్తోన్నా.. బౌలింగ్‌లో మాత్రం ప్రభావం చూపడం లేదు. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా అతడు పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని