Hardik Pandya : అదే గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా నా నినాదం: హార్దిక్‌ పాండ్య

హార్దిక్‌ పాండ్య తొలిసారిగా ఐపీఎల్‌లో సారథ్య బాధ్యతలను చేపట్టాడు. గత రెండేళ్లుగా...

Published : 18 Mar 2022 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్: హార్దిక్‌ పాండ్య తొలిసారిగా ఐపీఎల్‌లో సారథ్య బాధ్యతలను చేపట్టాడు. గత రెండేళ్లుగా టీమ్‌ఇండియా, ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీ తరఫున ప్రదర్శన అంతంతమాత్రమే. అందుకేనేమో ఐపీఎల్‌ జట్లలోని కెప్టెన్లలో అందరి కన్నూ హార్దిక్‌పైనే ఉంది. అయితే గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఎంపికైన తాను జట్టును నడిపించడంపై పూర్తి స్పష్టతతో ఉన్నట్లు హార్దిక్‌ పేర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్‌ జెర్సీ విడుదల సందర్భంగా హార్దిక్‌ మాట్లాడుతూ.. ‘‘యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ముందుంటా. సక్సెస్‌ను వెనుక నుంచి ఆనందిస్తా. ప్రస్తుత సీజన్‌కు నా నినాదం ఒక్కటే.. విజయం సాధిస్తే జట్టుకే అంకితం.. వైఫల్యం చెందితే మాత్రం బాధ్యత నాదే’’ అని పేర్కొన్నాడు.

మార్చి 26 నుంచి ఐపీఎల్-15వ సీజన్‌ ప్రారంభం కానుంది. మొత్తం పది జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్‌-బిలో చెన్నై సూపర్‌ కింగ్స్, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తోపాటు గుజరాత్‌ టైటాన్స్‌ ఉంది. గుజరాత్ టైటాన్స్‌ తన తొలి మ్యాచ్‌లో మరొక కొత్త జట్టు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్‌తో మార్చి 28న తలపడనుంది. 

గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు: హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), రషీద్‌ ఖాన్‌, లాకీ ఫెర్గూసన్, రాహుల్‌ తెవాతియా, శుభ్‌మన్‌ గిల్, మహమ్మద్‌ షమీ, యాష్ దయాల్, డేవిడ్ మిల్లర్‌, సాయి కిశోర్, అభినవ్ సదారంగాని, మాథ్యూ వేడ్, అల్జారీ జోసెఫ్, రహమనుతుల్లా గుర్బాజ్, వృద్ధిమాన్‌ సాహా, జయంత్‌ యాదవ్, విజయ్‌ శంకర్, వరుణ్ ఆరోన్, డొమినిక్‌ డ్రేక్స్‌, గుర్‌కీరత్ సింగ్, నూర్‌ అహ్మద్, దర్శన్ నల్కాండే, ప్రదీప్‌ సంగ్వాన్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని