Hardik: పాక్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. టీ20 ర్యాంకింగ్స్‌లోకి దూసుకొచ్చిన పాండ్య

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించడంలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో హార్దిక్‌ పాండ్య కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పాండ్య తొలుత బౌలింగ్‌లో...

Published : 01 Sep 2022 02:47 IST

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించడంలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో హార్దిక్‌ పాండ్య కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పాండ్య తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు, తర్వాత బ్యాటింగ్‌లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. గత టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్య (167) ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. టీ20 ఫార్మాట్‌లో తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఐదో స్థానానికి ఎగబాకాడు. ఆ మ్యాచ్‌ ముందు వరకు 13వ స్థానంలో ఉన్న హార్దిక్‌ ఎనిమిది స్థానాలకు ఎగబాకి ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. 

ఇక ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌ వరుస విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన రషీద్ ఖాన్‌ (708) టీ20 బౌలింగ్‌ విభాగంలో రెండు స్థానాలను మెరుగుపరుచుకుని మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. టాప్‌-10లో భారత్‌ నుంచి  భువనేశ్వర్‌ కుమార్‌ (661) మాత్రమే ఎనిమిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ముజీబ్‌ ఉర్ రెహ్మాన్ (660) టాప్‌-10లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో సూర్యకుమార్‌ యాదవ్ (792) మూడో స్థానానికి పడిపోయాడు. బాబర్ అజామ్‌ (810), మహమ్మద్ రిజ్వాన్ (796) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే సూర్యకుమార్‌కు ఐదెన్ మారక్రమ్ (792) నుంచి ముప్పు పొంచి ఉంది. ఆసియా కప్‌లోని మిగతా మ్యాచుల్లో సూర్య రాణిస్తే అగ్రస్థానం వైపు దూసుకెళ్లే అవకాశాలు మెరుగుపడతాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని