Hardik Pandya: ఎన్నో హెచ్చుతగ్గులు చూశా.. నన్ను గేలిచేశారు: మోదీతో హార్దిక్ పాండ్య

గత ఆరు నెలల కాలంలో ఎన్నో హెచ్చుతగ్గులను చవిచూశానని ప్రధాని మోదీతో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్య (Hardik Pandya) వెల్లడించారు. 

Updated : 06 Jul 2024 14:30 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో (T20 WorldCup) విజయఢంకా మోగించిన రోహిత్‌ సేన.. ప్రధాని మోదీ (Modi) నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమ్ఇండియా హార్దిక్ పాండ్య (Hardik Pandya) ప్రధానితో మాట్లాడుతూ.. గత కొద్దినెలలుగా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వెల్లడించాడు. క్రికెట్‌ అభిమానుల నుంచి ఎదురైన వ్యతిరేకత గురించి చెప్పాడు. మోదీతో సంభాషించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే..

‘‘గత ఆరు నెలల్లో ఎన్నో జరిగాయి. హెచ్చుతగ్గులను చవిచూశా. కొందరు నన్ను గేలిచేశారు. వీటన్నింటికి నేనిచ్చే సమాధానం ఆటతోనే ఉండాలని భావించా. అందుకోసం నేను దృఢంగా ఉండాలని, కష్టపడి పనిచేయాలని నమ్మాను. ఎలాంటి పరిస్థితి అయినా పోరాడడం ఆపకూడదని నమ్ముతాను. నాకు కెప్టెన్, జట్టు నుంచి మద్దతు అందింది. ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బౌలింగ్ చేసే అవకాశం లభించింది. సూర్యకుమార్ క్యాచ్ తర్వాత మేం సంబరాలు చేసుకున్నాం. మళ్లీ వెంటనే డౌట్‌ వచ్చి.. ఇంతకీ క్యాచ్‌ పట్టావా? లేదా? సూర్యను అడిగాం’’ అంటూ మైదానంలో జరిగిన విషయాన్ని చెప్పగానే మోదీ సహా అందరూ నవ్వేశారు. అది గేమ్‌ ఛేంజర్‌గా మారిందని, జట్టు ఒత్తిడిని తగ్గించిందని తెలిపారు.

‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య

టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించాడు హార్దిక్‌. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించాడు. ఈ మెగా టోర్నీలో నిలకడగా బౌలింగ్‌ చేసి 8 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. 151.57 స్ట్రయిక్‌ రేట్‌తో 144 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీనికి ముందు ఐపీఎల్‌లో అతడి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రోహిత్‌ స్థానంలో హార్దిక్‌కు ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ అప్పజెప్పడంతో ఆ జట్టు, హిట్‌మ్యాన్‌ అభిమానులు తీవ్ర అసంతృప్తి ప్రదర్శించారు. అతడి సారథ్యంలో జట్టు కూడా పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగానూ హార్దిక్‌ విఫలమైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ ప్రదర్శనతో తిట్టిననోళ్లే పొగుడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని