IND vs ENG: పంత్‌కు పదే పదే అదే మాట చెప్పా: హార్దిక్‌ పాండ్య

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. 260 పరుగుల ఛేదనలో 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును...

Published : 19 Jul 2022 02:11 IST

మాంచెస్టర్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. 260 పరుగుల ఛేదనలో 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును.. రిషభ్‌ పంత్‌ (125; 113 బంతుల్లో 16x4, 2x6), హార్దిక్‌ పాండ్య (71; 55 బంతుల్లో 10x4) ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 133 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలుత నెమ్మదిగా ఆడిన వీరు క్రీజులో కుదురుకున్నాక చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే హార్ది్‌క్‌ అర్ధ శతకం తర్వాత ధాటిగా ఆడుతూ ఔటయ్యాడు. కానీ, చివరివరకూ క్రీజులో పాతుకుపోయిన పంత్‌ వన్డల్లో తొలి సెంచరీ చేయడమే కాకుండా జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన హార్దిక్‌.. పంత్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. అతడు తొలుత నెమ్మదిగా ఆడాడని, తర్వాత తన సహజసిద్ధమైన షాట్లు ఆడాడని మెచ్చుకున్నాడు. అతడు చెలరేగుతుంటే చూస్తూ కూర్చోవాలని చెప్పాడు. ఈ క్రమంలోనే తామిద్దరం బ్యాటింగ్‌ చేసేటప్పుడు అతడికి కొన్ని సూచనలు చేసినట్లు హార్దిక్‌ వివరించాడు. ‘నేను పంత్‌తో పదే పదే ఒకటే మాట చెప్పాను. ఇలాంటి సమయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకోకపోవడమే మంచిదని, అదెంతో ముఖ్యమని సూచించాను. అతడికి, నాకూ ఉన్న నైపుణ్యాలతో పరుగులు చేయగలమని నమ్మాను. అప్పుడు ఇంగ్లాండ్‌ తిరిగి ఆధిక్యంలోకి రావాలంటే మమ్మల్ని ఔట్‌ చేయడం ఒక్కటే మార్గమని గ్రహించాను. దీంతో మంచి భాగస్వామ్యం నిర్మిస్తే సరిపోతుందని, దాంతో జట్టును విజయతీరాలకు చేర్చాలని పంత్‌కు వివరించాను’ అని హార్దిక్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని