Hardik Pandya: రాహుల్‌ ద్రవిడ్‌ ‘మాట’ మంత్రంలా పని చేసింది: హార్దిక్‌ పాండ్య

ఆల్‌రౌండర్‌గా భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న హార్దిక్‌ పాండ్య.. తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ బ్యాటర్‌గా హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు.

Updated : 23 Jun 2024 11:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ ముందు వరకు అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు? అనే ప్రశ్నలు వచ్చాయి. కానీ, తొలి మ్యాచ్‌ నుంచి తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ (IND vs BAN) హాఫ్‌ సెంచరీతోపాటు ఒక వికెట్‌ తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ను సొంతం చేసుకున్నాడు. గత వన్డే ప్రపంచ కప్‌ సందర్భంగా గాయపడటం.. ఆ తర్వాత కోలుకోవడానికి బాగా సమయం పట్టడం.. ఇక గత ఐపీఎల్‌లో ఎదురైన అనుభవం మాటల్లో చెప్పలేనిది. వీటన్నింటినీ దిగమింగుకుని పాండ్య రాణించడం విశేషం. ఈ మ్యాచ్‌ అనంతరం పాండ్య మాట్లాడుతూ.. గాయాల నుంచి కోలుకుని వచ్చాక ఇలాంటి ప్రదర్శన చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు.

‘‘దేశం తరఫున ఆడే అదృష్టం నాకు దక్కింది. గతంలో తీవ్రగాయం తర్వాత జట్టులోకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడా. ‘ఎవరైతే కష్టపడతారో.. వారి వెంటే లక్‌ కూడా ఉంటుంది’ అని అన్నాడు. ఆ మాటలే నాపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ వరల్డ్‌ కప్‌లో నాణ్యమైన క్రికెట్‌ ఆడుతున్నాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మా ప్రణాళికలను చక్కగా అమలు చేసి విజయవంతం అవుతున్నాం. ఈ వికెట్‌ మీద 180 స్కోరు సరిపోతుందని ముందే భావించాం. మేం 196 పరుగులు చేశాం. శివమ్‌ దూబెతో కలిసి భాగస్వామ్యం నిర్మించడమే కీలక పరిణామం. స్వల్ప వ్యవధుల్లో వికెట్లను కోల్పోయిన తర్వాత దూబె వచ్చాడు. కాస్త సమయం తీసుకుని ఎదురుదాడి చేయాలని ముందే భావించాం. స్పిన్నర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం అతడి బలం. వారి బౌలింగ్‌లో భారీ షాట్లు కొట్టాడు.

మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్‌ మందగించింది. సరైన లెంగ్త్‌తో బంతివేస్తే ఫలితం దక్కుతుంది. క్రమశిక్షణతో బౌలింగ్‌ చేసి వికెట్లను రాబట్టగలిగాం. ఓపెన్ స్టేడియం కావడంతో గాలి ప్రభావం కూడా ఉంటుంది. బ్యాటర్లకు భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వకూడదని అనుకున్నప్పటికీ.. గాలివాటం వారికి కలిసొచ్చింది. జట్టుగా మేం ముందుకు సాగుతున్నాం. త్వరగా వికెట్లు పడినా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవడంతోనే ఇది సాధ్యమవుతోంది’’ అని హార్దిక్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు