Hardik Pandya: ఆ ఒక్క ఓవర్‌ మ్యాచ్‌ గమనాన్ని మార్చేసింది: హార్దిక్‌ పాండ్య

టీ20 మెగా లీగ్‌లో గుజరాత్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి టాప్‌లో దూసుకుపోతోంది. ఈ విజయంపై ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య హర్షం వ్యక్తం చేశాడు...

Published : 03 Apr 2022 09:40 IST

ముంబయి: టీ20 మెగా లీగ్‌లో గుజరాత్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి టాప్‌లో దూసుకుపోతోంది. ఈ విజయంపై ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య హర్షం వ్యక్తం చేశాడు. తమ ఆటగాళ్లు కీలక సమయాల్లో రాణిస్తుండటం సంతోషంగా ఉందన్నాడు. గతరాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన పాండ్య.. ఫెర్గూసన్‌ కీలక సమయంలో రాణించి ఒక్క ఓవర్‌లో మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడని చెప్పాడు.

‘మా ఆటగాళ్లు ఇలా రాణించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఒకానొక దశలో దిల్లీ ఆధిపత్యం చెలాయించేలా కనిపించింది. అప్పుడే ఫెర్గూసన్‌ వేసిన ఒక్క ఓవర్‌ పరిస్థితులను మాకు అనుకూలంగా మార్చింది. మేం బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువ చేశాం. అయితే, మాకున్న బౌలింగ్‌ దళంతో ఆ జట్టును కట్టడి చేస్తామనే నమ్మకం ఉంది. అలాగే మా బౌలింగ్‌ యూనిట్‌లో ఆరోన్‌ గాయపడటంతో ఒక బౌలర్‌ తక్కువగా ఉన్నాడని అనిపించింది. అయినా వీలైనంతవరకు పోరాడాలని నిర్ణయించుకున్నాం. చివరికి విజయం సాధించాం. రిషభ్‌ పంత్‌ క్రీజులో ఉన్నంతవరకు పరిస్థితులు ఇరు జట్లకూ సమానంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దిల్లీనే కాస్త ముందున్నట్లు అనిపించింది. అలాంటి సమయంలోనే ఫెర్గూసన్‌ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మరోవైపు శుభ్‌మన్‌గిల్‌ కూడా గొప్పగా రాణించాడు. అతడి నుంచి ఇలాంటి బ్యాటింగే ఆశిస్తున్నాం. ఇతరులు కూడా ఈ యువ ఓపెనర్‌ నుంచి ప్రేరణ పొందొచ్చు’ అని గుజరాత్‌ కెప్టెన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని