Hardik Pandya: 10 పరుగులు తక్కువ చేశాం.. హైదరాబాద్‌తో ఓటమిపై పాండ్య

టీ20 లీగ్‌లో భాగంగా గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులు తక్కువ చేశామని గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు...

Published : 12 Apr 2022 09:38 IST

(Photo: Hardik Pandya Instagram)

ముంబయి: టీ20 లీగ్‌లో భాగంగా గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులు తక్కువ చేశామని గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. ఆ పరుగులు చేసుంటే చివర్లో పరిస్థితులు మరోలా ఉండేవన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పాండ్య (50 నాటౌట్‌; 42 బంతుల్లో 4x4, 1x6) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. అనంతరం ఈ లక్ష్యాన్ని హైదరాబాద్‌ 19.1 ఓవర్లలో రెండు వికెట్లే కోల్పోయి ఛేదించింది.

‘బ్యాటింగ్‌లో మేం సుమారు 10 పరుగులు తక్కువ చేశామనుకుంటా. ఆ పరుగులు చేసుంటే చివర్లో పరిస్థితులు మరోలా ఉండేవి. తొలుత మేం బంతితో బాగా ఆరంభించినా రెండు ఓవర్లలో వాళ్లు సాధించిన 30 పరుగులతోనే తిరిగి పోటీలోకి వచ్చారు. హైదరాబాద్‌ టీమ్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. వాళ్ల ప్రణాళికలను కచ్చితంగా అమలు చేశారు. వాళ్ల బౌలింగ్‌ విధానానికి క్రెడిట్‌ దక్కుతుంది. తప్పుల నుంచి మేం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటమి గురించి మేమంతా కూర్చొని చర్చించుకొని ముందుకు సాగుతాం’ అని హార్దిక్‌ పేర్కొన్నాడు.

(Photo: Kane Williamson Instagram)

ఇక హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యం మోస్తరు స్కోరేనని చెప్పాడు. ‘వాళ్లకు మేటి బౌలింగ్‌ దళం ఉంది. దీంతో మేం సరైన భాగస్వామ్యాలు నిర్మించాలనుకున్నాం. అదే పని చేశాం. మా ఆటగాళ్లు ఎవరేం చేయాలో వాళ్లకు స్పష్టంగా తెలుసు. ఈ మ్యాచ్‌లో పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, మేం వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాం. బౌండరీలు సాధించడం కష్టంగా అనిపించినా చివరికి విజయం సాధించడం సంతోషంగా ఉంది. మొత్తానికి ఈరోజు మా కుర్రాళ్లు మంచి ప్రదర్శన చేశారు. ఇక రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగి రాహుల్‌ త్రిపాఠి త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నా’ అని వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు