jasprit bumrah: బుమ్రా.. అంతే బలంగా తిరిగిరావాలి: క్రికెటర్ల భావోద్వేగం

బుమ్రా లేకుండానే ఆసీస్‌ పర్యటనకు వెళ్తుండటం బాధగా ఉందంటూ టీమ్‌ఇండియా ఆటగాళ్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

Published : 04 Oct 2022 20:07 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో కచ్చితంగా పాల్గొంటాడని ఎదురుచూసిన అభిమానులకు బీసీసీఐ ప్రకటన నిరాశనే మిగిల్చింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ కీలక సిరీస్‌కు బుమ్రా దూరం కావడం క్రికెటర్లను సైతం తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. అతడు లేకుండానే ఆసీస్‌ పర్యటనకు వెళ్తుండటం బాధగా ఉందంటూ టీమ్‌ఇండియా ఆటగాళ్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ భావోద్వేగాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. 

‘‘బుమ్రా.. నువ్వు త్వరగా కోలుకోవాలి. అంతే బలంగా తిరిగి రావాలి’’ అంటూ సూర్యకుమార్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశాడు. ‘‘జస్సీ.. నువ్వు ఎప్పటిలాగే బలమైన రీఎంట్రీ ఇవ్వాలి’’ అంటూ కింగ్‌ సింబల్‌తో పాటుగా లవ్‌ ఎమోజీని హార్దిక్‌ పాండ్యా పోస్ట్‌ చేశాడు. ఈ టోర్నీకి దూరం కావడంపై ఇప్పటికే స్పందించిన బుమ్రా తన శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు. తాను జట్టులో లేకపోయినా తమ వారిని ఉత్సాహపరచడంలో ముందుంటానని తెలిపాడు. అతడి ట్వీట్‌ను బీసీసీఐ రీట్వీట్‌ చేసింది. ‘మా పరుగుల వీరుడు త్వరగా కోలుకోవాలి’అంటూ ఆకాంక్షించింది.  మోకాలి గాయం కారణంగా ఆసీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌కు దూరమైన ఈ యువ బౌలర్‌ ఇటీవల సఫారీలతో జరిగిన టోర్నీలో సైతం ఆడలేదు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో చివరి మ్యాచ్‌ ఆడుతున్న భారత జట్టు.. ప్రపంచకప్‌ సిరీస్‌ కోసం అక్టోబర్‌ 6న ఆస్ట్రేలియా బయలుదేరనుంది. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని