IND vs SL: ఏ ఫార్మాటైనా నోబాల్స్‌ వేయడం క్రైమే.. : హార్దిక్‌ పాండ్య

అర్ష్‌దీప్‌ సింగ్‌ నోబాల్స్‌పై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) స్పందించాడు. ఆట ప్రాథమిక సూత్రాలను పక్కన పెట్టడం నేరం అంటూ వ్యాఖ్యానించాడు. 

Updated : 06 Jan 2023 11:37 IST

పుణె: శ్రీలంకతో రెండో టీ20(IND vs SL 2023)లో యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన నో బాల్స్‌పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.ఈ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. అయితే, అర్ష్‌దీప్‌ వేసిన రెండు ఓవర్లలో మొత్తం 5 నోబాల్స్‌ వేసి.. 23 అదనపు పరుగులను సమర్పించాడు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమికి ఈ నోబాల్స్‌ కూడా ఓ కారణమే అంటూ అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య(Hardik Pandya) కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫార్మాట్‌ ఏదైనా నోబాల్స్‌ వేయడం క్రైమ్‌ అంటూ పేర్కొన్నాడు. తాను అర్ష్‌దీప్‌ను తప్పుపట్టడం లేదని.. కానీ, ఈ యువ పేసర్‌ తన తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

‘‘అన్ని రోజులూ గొప్పగా ఆడటం సాధ్యం కాదు. కొన్ని చెడ్డ రోజులూ ఉంటాయి. అలాగని ఆట ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదు. గతంలోనూ అర్ష్‌దీప్‌(Arshdeep Singh) ఇలాగే నోబాల్స్‌ వేశాడు. ఇలా అయితే చాలా కష్టం.  ఈ విషయంలో అతడిని నిందించాలని, కఠినంగా వ్యవహరించాలని అనుకోవడం లేదు. కానీ, ఏ ఫార్మాట్‌లో అయినా నోబాల్స్‌ వేయడం నేరమన్న విషయం తెలిసిందే కదా’’ అంటూ పాండ్య తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

మ్యాచ్‌లో ఓటమికి గల కారణాలపై మాట్లాడుతూ.. తాము పవర్‌ప్లేలో వైఫల్యం చెందామని అన్నాడు. ‘‘పవర్‌ప్లేలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ గొప్పగా ఆడలేకపోయాం. అది మమ్మల్ని బాధించింది. కొన్ని చేయకూడని పొరపాట్లు సైతం చేశాం. అది అందరికీ తెలుసు. ఆటలో మనం నియంత్రించగలిగే విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టి ఆడాలని ఈ మ్యాచ్‌ వల్ల నేర్చుకున్నాం’’ అంటూ పాండ్య తెలిపాడు. అరంగేట్ర ఆటగాడు రాహుల్‌ త్రిపాఠిని నంబర్‌ 3లో బ్యాటింగ్‌ చేయించడానికి గల కారణాలను వివరిస్తూ.. ‘‘రాహుల్‌కు 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అలవాటే. ఈ ఫార్మాట్‌లో ఇప్పుడే అడుగుపెడుతున్నాడు కాబట్టి కాస్త సౌకర్యంగా ఆడగల స్థానం ఇస్తే బాగుంటుందని భావించాం’’అని వివరించాడు.

ఇక శ్రీలంక కెప్టెన్‌ శానక మాట్లాడుతూ.. అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ల భాగస్వామ్యంపై ప్రశంసలు కురిపించాడు. ‘‘దాదాపు మ్యాచ్‌ మా చేజారిపోయిందని అనుకున్నాం. భారత బ్యాటర్ల నైపుణ్యం అలాంటిది. క్లిష్టమైన పరిస్థితుల్లో భారత ఆటగాళ్లపై విజయం సాధించడం గొప్ప అనుభూతి’’ అంటూ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని