
Dhoni - Hardik Pandya : ధోని ప్రోత్సహించకుంటే.. అప్పుడే నా కెరీర్ ముగిసిపోయేది : హార్దిక్ పాండ్య
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ప్రశంసలు కురిపించాడు. ధోని ప్రోత్సహించకుంటే.. ఆరంభంలోనే తన కెరీర్ ముగిసిపోయేదన్నాడు. ఇటీవల అతడు ఇచ్చిన ఓ ఇంటర్వూలో తన కెరీర్ ఆరంభంలో ధోని అందించిన సహకారం గురించి వెల్లడించాడు. ధోని లేనిదే.. తన కెరీర్ లేదని పేర్కొన్నాడు.
‘భారత జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి నేను ఏదో ఒక విషయం నేర్చుకున్నాను. ముఖ్యంగా మహీ భాయ్ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. భారత జట్టుకి ఎంపికైనప్పుడు నేనో ముడి పదార్థాన్ని. అతడు నన్ను సానబట్టాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేలా ప్రోత్సహించాడు. మైదానంలో స్వేచ్ఛగా ఆడే అవకాశమిచ్చాడు. నా అరంగేట్ర మ్యాచ్లో జరిగిన ఓ ఘటన నాకు ఇంకా గుర్తుంది. నేను వేసిన తొలి ఓవర్లోనే 22 పరుగులు ఇచ్చాను. దీంతో ఇదే నా కెరీర్లో తొలి, చివరి మ్యాచ్ అవుతుందని భయపడిపోయాను. కానీ, ఆశ్చర్యకర రీతిలో ధోని నాకు మరో ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. అప్పటి నుంచి నా ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఈ ఒక్క ఘటనతో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ధోని భాయ్ ఏం పట్టించుకోనట్టే ఉంటాడు. కానీ, ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా గమనిస్తూ.. ఆటగాళ్ల ఎదుగుదలకు పూర్తి సహకారం అందిస్తాడు. లోపాలను, బలహీనతలను ఆటగాళ్లే స్వయంగా అధిగమించాలని అతడు ఆశించేవాడు. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోవడంతో ఎప్పటికప్పుడూ మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించేవాడిని. అందుకే ఇన్నాళ్లు జట్టులో ఉండగలిగాను’ అని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు.
వెన్నునొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్య గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లోకి కొత్తగా అడుగు పెట్టనున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి పాండ్య కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో పాండ్య దారుణంగా విఫలం కావడంతో ముంబయి ఇండియన్స్ యాజమాన్యం వదులుకున్న విషయం తెలిసిందే.