Dhoni - Haris Rauf: ధోనీని పట్టుబట్టి మరీ అదే అడిగా.. : పాకిస్థాన్‌ క్రికెటర్‌

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని పట్టుబట్టి మరీ చెన్నై జెర్సీనే అడిగానని, టీమ్‌ఇండియాది కాదని పాకిస్థాన్‌ ఆటగాడు హారిస్‌ రావుఫ్‌ తాజాగా వెల్లడించాడు...

Published : 19 Jul 2022 20:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని పట్టుబట్టి మరీ చెన్నై జెర్సీనే అడిగానని, టీమ్‌ఇండియాది కాదని పాకిస్థాన్‌ ఆటగాడు హారిస్‌ రావూఫ్‌ తాజాగా వెల్లడించాడు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడిన సందర్భంగా అతడు ఈ వివరణ ఇచ్చాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనంతరం హారిస్‌.. ధోనీని కలిసి కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలోనే ధోనీ ఆటోగ్రాఫ్‌తో కూడిన చెన్నై జెర్సీని తనకు ఒకటి బహుమతిగా ఇవ్వాలని కోరాడు. అందుకు సరే అని ఒప్పుకొన్న ధోనీ కొద్ది రోజుల తర్వాత హారిస్‌ ఆస్ట్రేలియాలో ఉండగా తన చెన్నై జెర్సీని బహుమతిగా పంపాడు. అదే విషయాన్ని రావూఫ్‌ వెల్లడించాడు. అయితే, తాను పట్టుబట్టి మరీ చెన్నై జెర్సీనే కావాలని, టీమ్‌ఇండియాది కాదని ధోనీతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు.

పాండ్య చెప్పిందే నిజమైంది..

అనంతరం టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యపై స్పందించిన హారిస్‌ రావూఫ్‌ మరో ఆసక్తికర విషయం వెల్లడించాడు. టీమ్‌ఇండియా 2018-19 సీజన్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా తాను నెట్‌ బౌలర్‌గా సేవలందించినట్లు చెప్పాడు. అప్పుడు పాండ్య చెప్పిన మాటలు తనకు భరోసా ఇచ్చాయని పేర్కొన్నాడు. ‘అప్పుడు టీమ్ఇండియా మేనేజర్‌కు నెట్‌ బౌలింగ్‌ చేసే బౌలర్లు అవసరమయ్యారు. దీంతో అంతర్జాతీయ క్రికెటర్లకు బౌలింగ్ చేయడం మంచి అవకాశమని భావించి భారత బ్యాట్స్‌మెన్‌కు నేను నెట్‌ బౌలర్‌లా సేవలందించా. ఆ సమయంలో పుజారా, కోహ్లీకి బౌలింగ్‌ చేశా. అప్పుడే నాతో పాటు బౌలింగ్‌ చేస్తున్న హార్దిక్‌ పాండ్య. నా బౌలింగ్‌ చూసి త్వరలోనే పాకిస్థాన్‌ జట్టుకు ఎంపికవుతానని చెప్పాడు. అది నాకు ఆత్మవిశ్వాసం పెంచింది’ అని రావూఫ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రాకముందు నాటి విషయాలను నెమరువేసుకున్నాడు. కాగా, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన హారిస్‌ రావుఫ్‌ గతేడాది టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ పాండ్య(11)ను తక్కువ స్కోరుకే ఔట్‌ చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని