Harmanpreet: అభిమాన జట్టు ఓడిపోవడం బాధించేదే అయినా.. బలంగా తిరిగొస్తాం: హర్మన్‌

ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు (Team India) ఫైనల్‌ గండం ఉన్నట్లుంది. మరోసారి ఆసీస్‌ చేతిలోనే (IND w Vs AUS w) ఓటమిపాలై మహిళల టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. 

Updated : 25 Feb 2023 16:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమ్‌ఇండియా (IND w Vs AUS w) కేవలం ఐదు పరుగుల తేడాతో ఓడి మహిళల టీ20 ప్రపంచకప్‌ (Womens World Cup 2023) సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. నువ్వానేనా అన్నట్లుగా మారిన మ్యాచ్‌లో ఒక దశలో భారత్‌ (Team India) విజయం సాధించేలా కనిపించింది. కానీ, అప్పటి వరకు అద్భుతంగా ఆడిన జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(Harmanpreet kaur) ఔట్ కావడంతో ఓటమి తప్పలేదు. సునాయాసంగా పరుగు రాబట్టాల్సిన సమయంలో కెప్టెన్ హర్మన్‌ రనౌట్‌ కావడంతో భారత్‌ కోలుకోలేకపోయింది. ఆసీస్‌ పట్టుబిగించి మ్యాచ్‌ను తమవైపు తిప్పేసుకొంది. భారీ ఆశలతో ప్రపంచకప్‌ బరిలోకి దిగిన భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో కెప్టెన్ హర్మన్‌ కన్నీళ్లు పెట్టుకొన్న దృశ్యాలు అభిమానులను భావోద్వేగానికి గురి చేశాయి. 

ప్రపంచకప్‌లో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు చెబుతూ హర్మన్‌ స్పెషల్‌ ట్వీట్‌ చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు. ప్రపంచకప్‌ ఆసాంతం మద్దతుగా నిలిచారు. ఇంత దూరం వస్తామని నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతులు. అభిమాన జట్టు ఓడినందుకు అభిమానిగా బాధ ఉంటుందని నాకూ తెలుసు. తప్పకుండా బలంగా పుంజుకొని తిరిగి వస్తాం. గొప్ప ప్రదర్శనతో అలరిస్తాం’’ అని హర్మన్‌ పోస్టు చేసింది. రెండో పరుగు తీసే క్రమంలో క్రీజ్‌కు కాస్త ముందుగా బ్యాట్‌ స్ట్రక్‌ కావడంతో హర్మన్‌ రనౌట్‌ అయింది. సులువుగా పరుగు వచ్చే సందర్భంలో అలా కావడం అభిమానులను మరింత బాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 167 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. హర్మన్‌ రనౌట్‌ను 2019లో వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఎంఎస్ ధోనీ కివీస్‌పై అయిన రనౌట్‌తో పోలుస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కీలక సమయాల్లో రనౌట్లు కావడం ప్రతికూల ఫలితాలను ఇస్తుందనే దానికి మరొక ఉదాహరణగా పేర్కొన్నారు. భారత ఫీల్డింగ్‌ కూడా గొప్పగా ఏమీ లేదని, మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచనలు వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు