harmanpreet kaur: జరిగిందేదో జరిగిపోయింది: మన్కడింగ్‌ వివాదంపై హర్మన్‌ప్రీత్‌

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మన్కడింగ్‌ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేసింది.

Published : 01 Oct 2022 01:14 IST

దిల్లీ: ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డే సందర్భంగా చార్లీ డీన్‌ను టీమ్‌ఇండియా బౌలర్‌ దీప్తి శర్మ రనౌట్‌(మన్కడింగ్‌) చేయడం పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. పదే పదే హెచ్చరించినా డీన్‌ క్రీజు నుంచి ముందుకు కదలడం వల్లే రనౌట్‌ చేయాల్సి వచ్చిందని దీప్తి వివరణ ఇచ్చినా దీనిపై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా టీమ్‌ఇండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేసింది. రనౌట్‌కు గల కారణాలను మరోసారి వివరించింది.

‘‘మొదటి రెండు మ్యాచుల్లోనూ బౌలర్‌ బంతిని వదలకముందే ఇంగ్లాండ్ బ్యాటర్‌ క్రీజ్‌ దాటి ముందుకు రావడం, దాని ద్వారా అదనపు ప్రయోజనాలు పొందడం దీప్తి గమనించింది. అది మా మధ్యన చర్చకు వస్తుండేది. జరిగిందేదో జరిగిపోయింది. కానీ తనను ఈ విధంగా రనౌట్‌ చేయాలని మేం ముందుగా అనుకోలేదు. ఒకసారి మైదానంలోకి దిగితే ఏదేమైనా గెలిచి తీరాలనే అనుకుంటాం. ఆ లక్ష్యం కోసం మనకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం. కానీ, నిబంధనలను అతిక్రమించకుండా ఆడటమనేది అన్నింటికన్నా ముఖ్యం. మేం అదే చేశాం. ఈ మ్యాచ్‌ కోసం ఒక ప్రణాళికతో పనిచేశాం. మా వంతు కృషి చేస్తే ఫలితం అదే వస్తుందని భావించాం. అందుకే మా గెలుపు ముందే నిశ్చయమైంది’’ అని హర్మన్‌ ప్రీత్‌ తెలిపింది. ఇటీవల ఆటకు సంబంధించిన కొన్ని నిబంధనలను మార్పు చేసిన ఐసీసీ మన్కడింగ్‌ను రనౌట్‌ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 1 నుంచి ఈ నిబంధనల మార్పు అమలులోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని