Harmanpreet kaur: టీ20 చరిత్రలోనే హర్మన్‌ప్రీత్‌ అరుదైన రికార్డు

భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(Harmanpreet kaur) టీ20 చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. 

Published : 15 Dec 2022 15:49 IST

ముంబయి: మహిళల క్రికెట్‌లో భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్(Harmanpreet kaur) చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ ఈ ఘనతను సాధించింది. ముంబయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌తో ఈ యువ కెప్టెన్‌ 140 టీ20లు పూర్తిచేసింది. 

ఇందులో 125 ఇన్నింగ్స్‌ల్లో 27.36. సగటుతో 2,736 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్‌లో 103 ఉత్తమ స్కోరుతో మొత్తం 8 అర్ధ శతకాలు, 1 శతకాన్ని నమోదు చేసింది. హర్మన్‌ప్రీత్‌ తర్వాతి స్థానంలో 139 టీ20లు ఆడి న్యూజిలాండ్‌ ప్లేయర్‌ సుజీ బేట్స్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌కు చెందిన డన్నీ వాట్‌(136) మూడో స్థానాన్ని దక్కించుకుంది.  ఆస్ట్రేలియా ప్లేయర్స్‌ అలీస్సా హేలీ(135), ఎలీస్‌ పెర్రీ(129) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌(INDW vs AUSW)లో భాగంగా బుధవారం జరిగిన మూడో టీ20లో భారత జట్టుకు నిరాశ తప్పలేదు. భారత్‌ను 21 పరుగుల తేడాతో ఆసీస్‌ జట్టు ఓడించిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ స్పందిస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేయడంలో వైఫల్యం జట్టు ఓటమికి కారణమైందని తెలిపింది. 

‘‘ఆసీస్‌ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని మేం కచ్చితంగా ఛేదిస్తామనే అనుకున్నాం. కానీ, దాదాపు ఏడు ఓవర్లలో 6 పరుగుల కన్నా తక్కువ స్కోర్‌ చేయడం మా జట్టును దెబ్బతీసింది. బౌండరీ కొట్టిన అనంతరం డాట్‌ బాల్స్‌ను ఎదుర్కోవలసి వచ్చింది. స్ట్రైక్‌ రొటేట్‌ చేయాల్సిన చోట చేయలేకపోవడం మరో ప్రతికూల అంశంగా మారింది. బౌండరీలు కొట్టే సమయంలో వికెట్లను కోల్పోవడం కూడా నష్టం చేకూర్చింది’’ అని వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని