IND w Vs AUS w: ఆసీస్‌తో సెమీస్‌.. పూజా ఔట్.. హర్మన్‌ ఆడటంపై అనుమానాలు..!

మహిళల టీ20 ప్రపంచకప్‌ (Womens T20 World Cup 2023)లో సెమీస్‌లో ఆసీస్‌తో తలపడేందుకు టీమ్‌ఇండియా (INDw Vs AUSw) సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు.

Updated : 23 Feb 2023 16:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens T20 World Cup 2023) టీమ్‌ఇండియా సెమీస్‌కు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో కీలకమైన పోరుకు సిద్ధమవుతోన్న తరుణంలో భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌ టీ20 ప్రపంచకప్‌ నుంచే వైదొలగగా.. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్‌ కౌర్ కూడా ఆసీస్‌తో సెమీస్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటుందో లేదోననే అనిశ్చితి కొనసాగుతోంది. హై ఫీవర్‌తో బాధపడిన హర్మన్‌ ఇవాళే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు సమాచారం. ఆమె సెమీస్‌లో ఆడుతుందో.. లేదో అనేది తేలాలంటే బీసీసీఐ అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. శ్వాసకోస సంబంధిత సమస్యతో పూజా దూరమైనట్లు బీసీసీఐ పేర్కొంది. అలాగే, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆడలేకపోయిన రాధా యాదవ్‌ కూడా సెమీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాలు వెల్లడించాయి. వీరు ముగ్గురూ బీసీసీఐ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నట్లు పేర్కొన్నాయి.

‘‘పూజా వస్త్రాకర్‌కు బదులు స్నేహ్‌ రాణాను స్క్వాడ్‌లోకి తీసుకొనేందుకు భారత్‌కు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌ టెక్నికల్‌ కమిటీ ఆమోదం తెలిపింది’’ అని ఐసీసీ ట్వీట్‌ చేసింది.  గ్రూప్‌ - B నుంచి రెండోస్థానంలో భారత్‌ సెమీస్‌లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు కీలకమైన మ్యాచ్‌కు ఆల్‌రౌండర్‌ను కోల్పోవడం టీమ్‌ఇండియాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ హర్మన్‌ ఆడకపోతే ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌గా ఉన్న స్మృతీ మంధాన జట్టును నడిపిస్తుంది. బలమైన ఆసీస్‌ను ఢీకొట్టాలంటే శక్తియుక్తులన్నింటినీ భారత్‌ ప్రయోగించాల్సి ఉంటుంది. హర్మన్‌, పూజా లేకపోయినా.. స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, రిచా ఘోష్, యస్తికా భాటియా వంటి టాప్‌ ప్లేయర్లు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు