IPL 2023: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా హ్యారీ బ్రూక్ నిలుస్తాడు: ఇంగ్లాండ్‌ మాజీ పేసర్

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (IPL 2023) కొత్త సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. పది ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను సిద్ధం చేసుకున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) కూడా కీలక ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. 

Published : 31 Mar 2023 00:08 IST

ఇంటర్నెట్ డెస్క్: హ్యారీ బ్రూక్.. ఇంగ్లాండ్‌కు చెందిన యువ ఆటగాడు. ఈసారి ఐపీఎల్‌లో (IPL 2023) అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH)భారీ మొత్తం వెచ్చించి దక్కించుకుంది. మినీ వేలంలో రూ. 13.25 కోట్లతో బ్రూక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు సీజన్లలోనూ లీగ్‌స్టేజ్‌కే పరిమితమై విమర్శలపాలైన ఎస్‌ఆర్‌హెచ్‌ ఈసారి ఎలాగైనా టైటిల్‌ రేసులో నిలవాలని భావిస్తోంది. అందుకోసం మయాంక్‌ అగర్వాల్, మార్‌క్రమ్, హ్యారీ బ్రూక్‌, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్‌ కూడిన బ్యాటింగ్‌ విభాగంపై ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ అభిమానుల్లో జోష్‌ వచ్చేలా ఇంగ్లాండ్‌ మాజీ పేసర్ స్టీవ్‌ హర్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్ నిలుస్తాడని ‘ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నీ’ అవార్డును సొంతం చేసుకుంటాడని వ్యాఖ్యానించాడు. 

‘‘ఆరెంజ్‌ క్యాప్ (అత్యధిక పరుగుల వీరుడికి ఇచ్చే క్యాప్)  పోటీలో హ్యారీ బ్రూక్ ముందుంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతడి వద్ద ఆరెంజ్‌ కిట్‌ ఉంది కదా. ఈ సీజన్‌లో అతడే అత్యుత్తమ ఆటగాడిగా ఉంటాడని అనిపిస్తోంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడు. సిరీస్ ఆసాంతం బ్రూక్ రాణిస్తే మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ అద్భుత ఫలితాలను అందుకోవడం ఖాయం’’ అని హార్మిసన్ తెలిపాడు. అయితే, బ్రూక్‌కు టెస్టు క్రికెట్‌లో నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలను వన్డేలు, టీ20ల్లో మాత్రం గొప్ప ప్రదర్శన లేదు. ఇప్పటి వరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు, మూడు అర్ధశతకాలు బాదాడు. ఇంగ్లాండ్‌ తరఫున 20 టీ20లను ఆడిన బ్రూక్ 372 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 26.57 మాత్రమే ఉన్నా స్ట్రైక్‌రేట్‌ మాత్రం 140కి దగ్గరగా ఉండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని