Run Out: టార్గెట్‌ దీప్తి శర్మ.. ఇంగ్లాండ్‌ మీడియాపై హర్షా భోగ్లే ఫైర్‌!

ఇంగ్లాండ్‌ బ్యాటర్ చార్లీ డీన్‌ను భారత మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ రనౌట్‌ చేయడం తెలిసిన విషయమే. అదే వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఇంగ్లాండ్‌ మీడియాను ఏకిపారేశాడు. 

Published : 01 Oct 2022 02:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మను లక్ష్యంగా చేసుకొని దారుణంగా విమర్శలు చేస్తున్న ఇంగ్లాండ్‌ మీడియాను ప్రముఖ వ్యాఖ్యాత, క్రికెట్‌ విశ్లేషకుడు హర్షా భోగ్లే తూర్పారబట్టాడు. చార్లీ డీన్‌ను రనౌట్ (మన్కడింగ్‌) చేయడంతో ఒక్కసారిగా వివాదాస్పదమైంది. బంతిని వేయకముందే క్రీజ్‌ను వదిలి వెళ్తున్న డీన్‌ను అప్పటికే హెచ్చరించినట్లు దీప్తి శర్మ చెప్పగా.. టీమ్‌ఇండియా నుంచి ఎలాంటి హెచ్చరిక రాలేదని ఇంగ్లాండ్‌ కెప్టెన్ హీథర్ నైట్ పేర్కొంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో భారత్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామికి చివరి మ్యాచ్‌ కావడం విశేషం. అయితే డీన్‌ను దీప్తి శర్మ ఇలా రనౌట్‌ చేయడమే వైరల్‌గా మారింది. క్రీడా స్ఫూర్తి గురించి చర్చ కొనసాగింది. ఈ క్రమంలో దీప్తి శర్మపై ఇంగ్లాండ్‌ మీడియా విమర్శలు చేసింది. దీంతో హర్షా భోగ్లే ట్విటర్‌ వేదికగా స్పందించాడు. 

‘‘క్రీడా చట్టం ప్రకారం ఆడిన ఓ మహిళా క్రికెటర్‌ను ప్రశ్నలతో ఇంగ్లాండ్‌ మీడియా ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే చట్టవిరుద్ధంగా ప్రయోజనాలను పొందిన వారిని మాత్రం ఎవరూ ప్రశ్నించలేకపోయారు. మీడియాలో సహేతుకమైన వ్యక్తులు ఉన్నారని భావిస్తున్నా. క్రికెట్‌ను చాలాకాలంపాటు పాలించిన ఇంగ్లాండ్‌ అది తప్పు అని అందరికీ చెబుతోంది. వలసవాద ఆధిపత్యం చాలా శక్తివంతమైంది. కొంతమంది దాన్ని ప్రశ్నించారు. అందుకే ఇంగ్లాండ్‌ తాము ఏదైతే తప్పు అని అనుకుంటుందో ప్రపంచమంతా అలాగే భావించాలని ఇప్పటికీ ఆశిస్తోంది. అయితే పరిధిని దాటి ఎవరూ ప్రవర్తించకూడదు. వారికి కరెక్ట్‌ అనిపించవచ్చేమో కానీ.. ఇతరులకు కాదు’’ అని వరుస ట్వీట్లలో హర్షా భోగ్లే విమర్శలు గుప్పించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని