మన్కడింగ్‌ సరైందే.. లాలాజలం నిషేధంపైనే సందేహాలు తీర్చాలి: హర్షల్‌

మొన్నటి వరకు ఎంతో వివాదాస్పదమైన ‘మన్కడింగ్‌’ను ...

Published : 19 Mar 2022 01:25 IST

ఇంటర్నెట్ డెస్క్: మొన్నటి వరకు ఎంతో వివాదాస్పదమైన ‘మన్కడింగ్‌’ను మెరిల్‌బోన్‌ క్రికెట్ క్లబ్‌ (ఎంసీసీ) అన్యాయమైన ఆట విభాగం నుంచి రనౌట్‌గా మార్చడంపై భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఎంసీసీ నిర్ణయం సరైందికాదని ఇంగ్లాండ్‌ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే టీమ్‌ఇండియా స్టార్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ అయితే ఎంసీసీ నిర్ణయాన్ని స్వాగతించాడు. 2019 ఐపీఎల్‌లో బట్లర్‌ను ఇలాగే అశ్విన్‌ రనౌట్‌ చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అశ్విన్‌ను మద్దతుగా గత ఐపీఎల్‌ సీజన్‌ పర్పల్‌ క్యాప్‌ విజేత, టీమ్‌ఇండియా పేసర్‌ హర్షల్‌ పటేల్‌ నిలిచాడు. మన్కడ్‌ను రనౌట్‌గా ఐసీసీ మార్చడం మంచి నిర్ణయమని అభినందించాడు. నిబంధనల పుస్తకంలో ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ‘మన్కడ్‌’ అనేది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించాడు. అలానే ఉమ్ము/ లాలాజలం బంతికి రుద్దడంపై పూర్తిగా నిషేధం విధించడంపై పలు సందేహాలను లేవనెత్తాడు.

‘‘మన్కడ్‌ను ఇక నుంచి అన్యాయమైన ఆట విభాగం నుంచి రనౌట్‌గా మారుస్తూ ఎంసీసీ తీసుకున్న నిర్ణయం బాగుంది. ఇదే క్రమంలో బంతికి లాలాజలం పూయడం పూర్తిగా నిషేధం విధించడంపై కొన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. నేను గత రెండేళ్లుగా ఎర్రబంతి (టెస్టులు) క్రికెట్‌ ఎక్కువగా ఆడలేదు. అందుకే దాని గురించి చెప్పలేను. అయితే ఆయా జట్లు చల్లటి వాతావరణంలో ఆడితే ఆటగాళ్లకు చెమట పెద్దగా పట్టదు. అలాంటప్పుడు ఏం చేయగలరు? బంతికి మెరుపు తెచ్చేందుకు బౌలర్లు, ఆటగాళ్లు ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని హర్షల్‌ పటేల్‌ అన్నాడు.

ఐపీఎల్‌ 2022 సీజన్‌కు మార్క్‌వుడ్‌ దూరం!

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ ఫ్రాంచైజీ ఆటగాడు మార్క్‌వుడ్ ఐపీఎల్‌ 15వ సీజన్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. మోచేతి గాయం కారణంగా ఆడలేకపోతున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా మార్క్‌వుడ్‌ గాయపడ్డాడు. ఐపీఎల్‌ మెగా వేలంలో మార్క్‌వుడ్‌ను ఎల్‌ఎస్‌జీ రూ.7.5 కోట్లకు సొంతం చేసుకుంది. మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్‌ 2022 సీజన్ పోటీలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మార్చి 28న గుజరాత్‌ టైటాన్స్‌తో లఖ్‌నవూ తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని