SKY: సూర్యకుమార్‌ కంటే అతడే ఒక మెట్టు పైనుంటాడు: హర్షల్ పటేల్

ముంబయి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఫామ్‌లేమి కొనసాగుతోంది. ఇటీవల ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో విఫలమై విమర్శలపాలైన సూర్య.. ఆర్‌సీబీతో తొలి మ్యాచ్‌లోనూ పెద్దగా రాణించలేకపోయాడు.

Published : 04 Apr 2023 02:02 IST

ఇంటర్నెట్ డెస్క్: సూర్యకుమార్‌ యాదవ్‌.. గత ఆరు నెలల ముందు వరకు ఈ పేరు వింటే ప్రత్యర్థులకు హడల్. అంతర్జాతీయంగా టీ20ల్లో టాప్‌ ర్యాంకర్‌. అయితే, ఇటీవల ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఐపీఎల్‌ 16వ సీజన్‌ (IPL 2023) తొలి మ్యాచ్‌లోనూ విఫలమై నిరాశపరిచాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుపై 16 బంతుల్లో 15 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. కేవలం ఒక్క ఫోర్ మాత్రమే కొట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఆర్‌సీబీ బౌలర్ హర్షల్‌ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్‌ను అడ్డుకొనేందుకు తమ బౌలింగ్‌ యూనిట్ ప్రణాళికలను సిద్ధం చేసుకుందని, పక్కాగా అమలు చేసినట్లు తెలిపాడు. 

‘‘ఇప్పుడు సూర్యకుమార్‌ ఎలాంటి ఫామ్‌లో ఉన్నప్పటికీ.. అతడి సత్తాను దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేసి అమలు చేయాలి. అతడే ఏం చేస్తాడనేది అతడి ఇష్టం. ఇలాంటి పరిస్థితులను ( 4 ఓవర్లలో 43 పరుగులు ఇవ్వడం) ఎదుర్కోవడం నాకు కొత్త కాదు. ఆర్‌సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ అయితే సూర్య కంటే ఒక అడుగు ముందుంటాడు. అతడు తనకు కావాల్సిన చోట బంతి పడేలా బౌలర్లను ప్రభావితం చేయగల సమర్థుడు. సూర్యకుమార్‌ మాత్రం పిచ్‌ వెలుపల ఆఫ్‌స్టంప్‌ వికెట్‌పై స్వీప్‌ చేసేందుకు ప్రయత్నిస్తాడు. తన శరీరం మీదకు బంతిని తీసుకొని ఆడటం కూడా సూర్యలో ఉన్న మరో క్వాలిటీ. ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు’’ అని హర్షల్‌ తెలిపాడు. తిలక్‌ వర్మ (84) రాణించడంతో ముంబయి మంచి స్కోరు సాధించగలిగింది. కానీ, ఫాఫ్‌ డుప్లెసిస్ (73)తోపాటు విరాట్ కోహ్లీ (82*) అదరగొట్టడంతో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ముంబయిపై ఘన విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని