Venkatesh Prasad: కేఎల్‌ రాహుల్‌ పట్ల నేను కఠినంగా ప్రవర్తించలేదు : వెంకటేశ్‌ ప్రసాద్‌

కేఎల్‌ రాహుల్‌(KL Rahul)పై తాను చేసిన విమర్శలపై వెంకటేశ్‌ ప్రసాద్‌ స్పందించాడు. అతడి పట్ల కఠినంగా మాట్లాడలేదని చెప్పాడు.

Published : 22 Mar 2023 01:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌.. కేఎల్‌ రాహుల్‌ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు చేసి  వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేసిన రాహుల్‌పై.. ప్రసాద్‌ విమర్శలతో విరుచుకుపడ్డాడు. అప్పుడు ప్రసాద్‌కు పలువురి నుంచి మద్దతు కూడా లభించింది. అయితే.. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో కేఎల్‌ తిరిగి పుంజుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దీంతో ప్రసాద్‌ తన వాఖ్యలపై వివరణ ఇచ్చుకొన్నాడు.

‘నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. అయితే.. నాకు ఆ సమయంలో ఏది అనిపిస్తే.. అది చెప్పాను అంతే. కొందరు దీన్ని సమర్థించారు. మరి కొందరు వ్యతిరేకించారు. అది వారిష్టం. నేను కేవలం కేఎల్ రాహుల్‌ గురించే మాట్లాడలేదు.. సర్ఫరాజ్‌ అహ్మద్‌పై కూడా నా అభిప్రాయలను వ్యక్తం చేశా. నేను ఎక్కడా గీత దాటలేదు’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నాడు.

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో రాహుల్‌ ఇన్నింగ్స్‌ను వెంకటేశ్‌ ప్రసాద్‌ మెచ్చుకున్న విషయం తెలిసిందే. రాహుల్‌ టాలెంట్‌పై తనకు గొప్ప గౌరవం ఉందంటూ పేర్కొన్నాడు. ‘కేఎల్‌ రాహుల్‌పై నాకు గొప్ప గౌరవం ఉంది. అండర్‌-16 నుంచి అతడిని చూస్తున్నా. కర్ణాటకలో అతడితో కలిసి పనిచేశాను. అతడికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి మద్దతు లభించింది. కానీ.. అతడు స్థాయికి తగ్గట్లు రాణించలేదు. కొన్ని నెలల్లో మెరుగుపడతాడని నేను భావిస్తున్నాను. నేను అతడి పట్ల కఠినంగా ప్రవర్తించలేదు. నేను ఏం అనుకున్నానో అదే చెప్పాను’ అని ప్రసాద్‌ వెల్లడించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు